సంగెం, ఫిబ్రవరి 28: సర్కారు బడుల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలను బాగు చేసేందుకు సోమవారం జిల్లావ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చర్చించారు. ఇందులో భాగంగా సంగెం ఎంపీడీవో కార్యాలయంలో మన ఊరు-మన బడి ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్మన్లకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హరిసింగ్ పాల్గొని మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమానికి సంగెం మండలంలో 17 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ఎస్ఎంసీ తీర్మానాలతోనే నిధులను ఖర్చు చేయాలని సూచించారు. రన్నింగ్ వాటర్‌తో మూత్రశాలల ఏర్పాటు, ప్రహరీలు, వంట గది, పాఠశాలల గదులకు రంగులు, డైనింగ్ హాల్, కొత్త తరగతి గదుల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి బీ రవీందర్, ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్, నరహరి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎస్ఎంసీ చైర్మన్లు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
సర్కారు బడులకు పెద్దపీట
సర్కారు బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు. నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన ఊరు-మన బడి బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. బడులను అభివృద్ధి చేసి తెలుగుతోపాటు ఆంగ్ల బోధన అమలు చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఉపాధ్యాయులకు తోడుగా ప్రజాప్రతినిధులు, మేధావులు, యువకులు, మహిళలు ముందుండి సర్కారు బడుల ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆమె కోరారు. మండల ప్రత్యేకాధికారి జహీరొద్దీన్, ఎంపీడీవో విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, ఎంపీవో కూచన ప్రకాశ్, హెచ్ఎం రామస్వామి పాల్గొన్నారు.
నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సమీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బాటలు పడుతాయన్నారు. సర్కారు బడులకు పిల్లలను పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. సమావేశంలో ఎంపీపీ కళావతి, ఎంఈవో రత్నమాల, ఉమామహేశ్వర్, సీఆర్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖానాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు మాట్లాడుతూ మొదటి విడుతలో మండలంలో 11 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు. మొదట మండలంలోని 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుందన్నారు. సమావేశంలో ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్‌లు చిరంజీవి, కాస ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీలు కవిత, సుభాన్‌బీ, లింగమ్మ, హెచ్ఎం దూళం రాజేందర్, ఏఈ చందర్, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధి కోసమే..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షించారు. ఉపాధ్యాయులు, అధికారులు ‘మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కావాలని కోరారు. సమీక్షలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎంఈవో రంగయ్య పాల్గొన్నారు. చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాదావత్ విజేందర్ అధ్యక్షతన మన ఊరు-మన బడి- మనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి ఉండ్రాతి సృజన్‌తేజ మాట్లాడుతూ మండలంలోని 50 స్కూళ్లకు మొదటి విడుతలో 11 ఉన్నత పాఠశాలల, ఐదు యూపీఎస్‌లు, ఒక పీఎస్ కలిపి మొత్తం 17 పాఠశాలలు ఎంపికైనట్లు వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు తయారు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో లలిత, ఏఈ నరేశ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు సీహెచ్ విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గీసుగొండ ఎంపీడీవో కార్యాలయంలో మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యనందిస్తున్నదన్నారు. మండలంలోని 14 పాఠశాలలు మొదటి విడుతలో ఎంపికైనట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సభ్యులు, హెచ్ఎంలు సమన్వయంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దాతలు, పూర్వ విద్యార్థులు పాఠశాలల అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమీక్షలో ఎంఈవో విజయ్‌కుమార్, నోడల్ అధికారి రజాక్, ఎంపీపీ సౌజన్య, ఎంపీడీవో రమేశ్, వైస్ ఎంపీపీ శ్రావ్య, కార్పొరేటర్ మనోహర్, సర్పంచ్‌లు పూండ్రు జైపాల్రెడి,్డ మల్లారెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అందరూ భాగస్వాములు కావాలి
పాఠశాలల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ జాటోత్ రమేశ్ పిలుపునిచ్చారు. నెక్కొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మన ఊరు-మన బడి కార్యక్రమంపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో స్కూళ్ల రూపురేఖలు మారుతాయన్నారు. సమావేశంలో ఎంపీడీవో రవి, ఎంఈవో రత్నమాల, ప్రత్యేక అధికారి ఉషాదయాళ్, ఏఈ రాజ్‌కుమార్, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. పర్వతగిరిలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ కమల పంతులు అధ్యక్షతన సమీక్షించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న బడి అభివృద్ధికి సాయం అందించాలని కోరారు. సమీక్షలో వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, సర్పంచ్ మాలతీరావు, ప్రత్యేకాధికారి సంజీవరెడ్డి, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ మండల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శంబునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడిపై అవగాహన కల్పించారు. సమీక్షలో డీఈవో వాసంతి, కార్పొరేటర్లు పోశాల పద్మ, మరుపల్ల రవి, ఈదురు అరుణ, హెచ్ఎంలు పాల్గొన్నారు.