నర్సంపేటరూరల్/సంగెం, ఫిబ్రవరి 28: మహాశివరాత్రికి జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంగళవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోనున్నారు. నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అర్చనలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చన కార్యక్రమలను ఐనవోలు కృష్ణమూర్తిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భక్తుల జాగరణ కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. కమిటీ బాధ్యులు దేశిని సుదర్శన్‌గౌడ్, మాదన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, కొండెం వీరేంద్రస్వామి, గిరబోయిన రాజేందర్, అంబటి సర్వేశ్వరరాజు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. అలాగే, గురిజాలలోని రామక్క రుద్రేశ్వరాలయం(మల్లన్నపాదాలు)లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శివపార్వతుల కల్యాణానికి ఆహ్వానం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగమేశ్వరాలయంలో నిర్వహించే శివపార్వతుల కల్యాణోత్సవానికి హాజరు కావాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని సంగమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. చల్లాను కలిసిన వారిలో ఆలయ గౌరవ అధ్యక్షుడు గుండేటి బాబు, అధ్యక్షుడు కందకట్ల నరహరి, ఆలయ ప్రధాన అర్చకుడు అప్పె నాగార్జునశర్మ, ఎంపీటీసీ మల్లయ్య, కుంటపల్లి సర్పంచ్ కావటి వెంకటయ్య, కోడూరి సదయ్య, మునుకుంట్ల కోటేశ్వర్, మోహన్, మెట్టుపెల్లి కొమురయ్య, బొమ్మ యుగేంధర్, వెంకటేశ్వర్లు, నర్సయ్య, కుమారస్వామి, ఎలుకుర్తి బుచ్చిరెడ్డి, ఎలుగోయ లింగయ్య, పురం శ్రీనివాస్ ఉన్నారు. కరీమాబాద్ బొమ్మలగుడిలో ఏర్పాట్లను వరంగల్ 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్దం రాజు పరిశీలించారు. ఆయన వెంట పూజారి శివపుర రామలింగ ఆరాధ్య, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. చెన్నారావుపేటలోని శ్రీభ్రమరాంబిక సమేత సిద్ధేశ్వరాలయం విద్యద్దీపాలతో ముస్తాబైంది. భక్తుల దర్శనార్థం మందిరంలో ముగ్ధుంపురం గ్రామానికి చెందిన వెల్దండి జ్యోతిబసు తన సొంత ఖర్చులతో స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు చేయించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ కమిటీ చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి కోరారు. ఖానాపురం మండలంలోని కొత్తూరు దుర్గామళ్లేశ్వరస్వామి, బాలుతండాలోని త్రికూట ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివ కల్యాణానికి ఏర్పాట్లు చేసినట్లు అర్చకుడు బీవీఎన్శాస్త్రి తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 12 గంటలకూ పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. సర్పంచ్ సొంటిరెడ్డి యుమన ఆధ్వర్యంలో ఆలయాన్ని ముస్తాబు చేశారు.