ఖిలావరంగల్, ఫిబ్రవరి 20 : అంగన్వాడీ కేంద్రా ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సెంటర్లకు వచ్చే లబ్ధిదారులు, చిన్నారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మార్పులకు స్వీకారం చుట్టింది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతు న్న అవినీతి అక్రమాలకు చెక్‌పెట్టేందుకు తాజాగా ‘ఆరోగ్యలక్ష్మి’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించిం ది. ఈ యాప్‌తో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సులభతరం అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. కొత్తగా రూ పొందించిన ఈ యాప్‌లో అంగన్వాడీ సెంటర్ల వివరాలు, లబ్ధిదారుల నమోదు, హాజరు, సరుకుల వివరాలు ప్రతిరోజూ నమోదు చేయనున్నారు.
ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో 14 రకాల రిజిస్ట ర్లు వినియోగించడంతోపాటు సీడీపీవో కార్యాలయా ల్లో రెండు మూడు రకాల రిపోర్టులు మ్యాన్యువల్‌గా తయారు చేసి మళ్లీ ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి వ స్తుందని ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు. ఈ యాప్ అమలులోకి వస్తే అలాంటి సమస్యలు ఉండకుండా రికార్డులు రాసే పని ఉండదు. దీంతో అంగన్వాడీ టీచర్లకు రోజు వారీగా రాసే పనిభారం తగ్గుతుం ది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కూడా సులభతరం అవుతుంది. ఈ యాప్‌లో వివరాలు ఏ విధంగా నమోదు చేయాలనే అంశాలపై ఇటీవల వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం నుంచి వచ్చిన నిపుణులు సీడీపీవోలు, సూపర్వైజర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా సీడీపీవోలు, సూపర్వైజర్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేయనున్నారు. రానున్న మార్చి నెల నుంచి ఆరోగ్యలక్ష్మి యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పక్కాగా వివరాల నమోదు..
కొత్తగా రూపొందించిన ఆరోగ్యలక్ష్మి యాప్‌లో పక్కాగా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు ఇప్పటికే సరైన వివరాలు సేకరిం చే పనిలో అధికారులు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు, సూపర్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను అందజేసింది. అయితే, ఇప్పుడున్న సిమ్‌తో నెట్ సమస్యలు వస్తున్నట్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నెట్వర్క్ మార్చి మళ్లీ కొత్త సిమ్‌లు కూడా అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందుగా స్మార్ట్ ఫోన్లలో అంగన్వాడీ టీచర్లు ఆరోగ్యలక్ష్మి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ప్రభుత్వం సూచించిన విధంగా వివరాలు ఎలా నమోదు చేయాలనే అంశంపై అంగన్వాడీ టీచర్లకు త్వరలోనే మండలాలు, సెక్టార్ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి, స్థితిగతులు, మౌలిక వసతులు, సౌకర్యాలు, కేంద్రంలో ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరు, ప్రతి రోజూ అందించే పౌష్టికాహారం, సరుకుల వినియోగం, నిల్వలు, చిన్నారుల పెరుగుదల తదితర వివరాలు నమోదు చేయాలి. సెంటర్‌కు వచ్చిన లబ్ధ్దిదారులు, సరుకులు పంపిణీ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను ప్రతిరోజూ యాప్‌లో తప్పకుండా నమో దు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఇప్పటి వర కు 14 రిజిస్టర్లలో అంగన్వాడీ టీచర్లు నమోదు చేసేవారు. ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువగా తీ సుకోవడంతో అంగన్వాడీలపై పని భారం ఎక్కువగా ఉండేది. ఈ కొత్త యాప్‌తో వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే రిజిస్టర్లు రాసే పని ఉండదని వారు అంటున్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు సైతం ఎప్పుడైనా యాప్‌లో వివరాలు చూసే అవకాశం ఉంటుంది.
జిల్లాలో మూడు ప్రాజెక్టులు..
జిల్లాలో వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 847 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 72 మినీ మెయిన్స్ కేంద్రాలు కలిపి మొత్తం 919 ఉన్నాయి. వీటిలో చిన్నారులు 47,278 మంది, గర్భిణులు 5,509 మంది, బాలింతలు 6,332 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి సంబంధించిన ఆధార్ నంబర్లను ముందుగా సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆరోగ్యలక్ష్మి యాప్‌లో అప్డేట్ చేసి మార్చి నెల నుంచి అమలు చేయనున్నారు.