బచ్చన్నపేట, ఫిబ్రవరి 20 : ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేయనున్న ‘మన ఊరు- మనబడి’తో సర్కారు పాఠశాలల్లో సౌలత్లు పెరుగనున్నాయి. తరగతి గదులకు పెయింటింగ్, బాత్ రూం, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వంట గది, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి, ప్రహరీలకు మరమ్మతులు, కొత్తవి నిర్మించనున్నారు. ఇందుకు గాను మొదటి దశలో జనగామ జిల్లాలో 100 ప్రాథమిక,19 ప్రాథమికోన్నత, 57 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి పాఠశాల కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమంతో పెరిగిన విద్యార్థులు
బచ్చన్నపేట మండలంలోని బండనాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నా విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమే ఉండేది. కావాల్సినన్ని తరగతి గదులు, ఆటలు ఆడుకునేందుకు విశాలమైన మైదానం, రకరకాల చెట్లు, పండ్ల మొక్కలతో కళకళలాడుతున్నా ఎక్కువ మంది ప్రైవేటు బడికే మొగ్గు చూపేది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించింది. దీంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2016లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టగా, 2018లో 59 మంది, 2019లో 60, 2020లో 97, 2021లో108, 2022లో 114 మందికి చేరింది.
ఆహ్లాదకరమైన వాతావరణం..
ప్రైవేటు బడికి దీటుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బందారపు లక్ష్మయ్య సూచనల మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో పాఠశాల ఆవరణ, ప్రాంగణమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థులు చదువుతోపాటు మొక్కలకు నీళ్లు పోస్తుంటారు. ఉపాధ్యాయులు సిద్ధయ్య, మడూరి వెంకటేశ్, జ్యోతి, సుజాత, రాజేందర్‌తో అంగన్వాడీ టీచర్ సుంకోజు రజిత విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాఠశాలలో బోరు సౌకర్యం లేకున్నా కేవలం మిషన్ భగీరథ నీటితోనే పాఠశాలలో 600 మొక్కలు పెంచుతున్నారు.
తల్లిదండ్రుల కల నెరవేర్చుతున్నం..
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ చదువు కావాలన్న కల నేడు సాకారమవుతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక సర్కారు నెరవేర్చుతోంది. ఇంగ్లిష్ చెప్పడంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నం.
– బందారపు లక్ష్మయ్య, హెచ్ఎం, బండనాగారం పీఎస్
ఊళ్లో బడికే పంపిస్తున్నం..
గతంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాలలోని ఓ ప్రైవేటు స్కూలుకు మా పిల్లలను పంపేది. ఫీజులు చెల్లించక ఇబ్బందులు పడ్డం. గ్రామంలోని బడిలో ఇంగ్లిష్ మీడియం పెట్టడంతో ఇక్కడే జాయిన్ చేయించిన. మంచిగ చదువు చెప్పుతున్నరు.
– ఉత్కం జ్యోతి, బండనాగారం
మంచిగుంది..
స్కూలు మంచిగుంది. ఇష్టంగా చదువుకుంటున్నం. మా ఊరి సర్కారు బడిలోనే అన్ని సౌకర్యాలు కల్పి స్తుండ్రు. ఫ్రీగా యూనిఫాం, మధ్యాహ్నం అన్నం పెడుతాన్రు. ఉచితంగా నోటు పుస్తకాలు కూడా ఇస్తుండ్రు.
– లింగాల అశుతోష్రెడ్డి, నాల్గో తరగతి విద్యార్థి