ఖిలావరంగల్, ఫిబ్రవరి 20: స్వచ్ఛదనానికి ప్రతీకైనది.. అమ్మ ప్రేమలా తియ్యనైనది.. అమృత జలపాతం.. భావ గుభాళింపు.. సుగంధ భాష.. తెలుగు భాష. ప్రేమైనా.. బాధైనా.. కోపమైనా.. భావం ఏదైనా.. మనసార పలకాలన్నా.. చెవులారా వినాలన్నా అమ్మ భాషతోనే సాధ్యం. మన భాషను.. యాసను కాపాడుకోవడం.. భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. సోమవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999 నవంబర్ 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఏటా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలోని అల్పా, అసంఖ్యాక భాషలన్నింటినీ రక్షించుకోవాలని యునెస్కో సూచిందింది. భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే, మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారా తక్కిన భాషల్ని నేర్చుకోవడం వల్ల అనంత విజ్ఞానాన్ని పొందడం సరియైన మార్గం.
దేశ భాషలందు తెలుగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్సా.. అవును ముమ్మాటికి నిజమే. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని శ్రీకృష్ణదేవరాయుల నుంచి మొదలు.. అనేక కువులు, ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికులు కూడా తెలుగుభాష మాధుర్యం గురించి ఎలుగెత్తి చాటారు. వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతిపెద్దదిగా మన్నలను అందుకుంది. దేశం మొత్తంమీద హిందీ తర్వాత ఎక్కవ మంది మాట్లాడే భాష తెలుగే. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకు ప్రత్యామ్నాయం కావని కవులు ఘట్టాపథంగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, విదేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలు పెరుగడంతో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం అనివార్యమైంది. అయితే, ఆంగ్లం నేర్చుకోవడం అవసరమే అయినా విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే తప్పా దాని మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం, ఎగతాలి చేయడం సరికాదు. మాతృభాష ఆంగ్లం కిందపడి నలిగిపోకుండా కృషి చేయాలని భాషాపండితులు పేర్కొంటున్నారు. ప్రపంచ భాషల్లో ఎట్టి శబ్దాలైనా తనలో జీర్చించుకోగల సత్తా, ఉచ్చరింపజేయగల శక్తి సంస్కృతానికి ఇటు తెలుగుకు తప్ప మరే భాషకు లేదని ఎందరెందరో కవులు వ్యాకరణాలు రచించి తెలుగుభాషకు పట్టం కట్టారు. కాబట్టి మన భాషను.. యాసను కాపాడుకోవడం.. భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
మాతృభాషలోనే సంభాషణలు
సాఫ్ట్వేర్ రంగంలో విదేశీ భాష ముఖ్యం కాబట్టి ఉద్యోగ రీత్యా ఆంగ్లంలో మాట్లాడుతాం. ఫైల్స్ తయారు చేస్తాం. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తెలుగులోనే మాట్లాడుతాం. మన భాష, యాస ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషలోని కమ్మదనం వర్ణించలేం.
-మంద దశరథం, సాఫ్ట్వేర్ ఉద్యోగి