గీసుగొండ, ఫిబ్రవరి 20 : అమెరికన్ మార్కెట్ తరహాలో హోల్‌సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను వ్యా పారులు నిర్మించి తెలంగాణకే వన్నె తెచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో 318 గదులతో నిర్మించిన హోల్‌సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ తరహా హోల్‌సేల్ మార్కెట్ ఎక్కడా లేదన్నారు. మార్కెట్ నిర్మాణ ఖర్చులకు సంబంధించి నివేదిక అందిస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ పాత బీట్‌బజార్ వ్యాపారులంతా కలిసి సొంత ఖర్చులతో ఈ కాంప్లెక్స్‌ను నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. రైతులు బాగుంటేనే వ్యాపారులు బాగుంటారన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, సాగు నీరు అందిస్తున్నామని, దీంతో రైతులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందన్నారు. వరంగల్ జిల్లా మెడికల్ హబ్‌గా మారబోతున్నదన్నారు. జిల్లాలో సూపర్ మల్టీస్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం నిర్మించబోతున్నదన్నారు. త్వరలోనే ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హోల్‌సేల్ మార్కెట్లో కొనుగోలు దారులు ఇబ్బందులు పడకుండా బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
వ్యాపారులకు అండగా ఉంటాం..
హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌కు డ్రైనేజీ నిర్మాణానికి గాను రూ.85లక్షలు మంజూరయినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. హోల్‌సేల్ మార్కెట్ జిల్లాకే తలమానికంగా నిలుస్తుందన్నారు. అనంతరం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. వరంగల్ ప్రాంతం వివిధ వ్యాపారాలకు కూడలిగా ఉందన్నారు. హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ అద్భుతమన్నారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పరంగా వ్యాపారులకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. వరంగల్ పాత బీట్ బజార్లో ఆర్వోబీ నిర్మాణంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎమ్మెల్సీ బం డా ప్రకాశ్ మాట్లాడుతూ.. వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో వ్యాపార, వాణిజ్య రంగాల్లో వరంగల్ అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ అధ్యక్షుడు తోట జగన్నాథం మాట్లాడుతూ.. రూ. 300 కోట్లతో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం లో ప్రతి వ్యాపారుడి పాత్ర ఉందన్నారు. వ్యాపారులంతా ఒక కుటుంబంలా కలిసిపోయి దీన్ని నిర్మించుకున్నామని, వ్యాపారం బాగా జరిగి అందరూ బాగుపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్ర దీప్‌రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీ షా, చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సభ్యులు రాజేశ్ డీ కరానీ, పబ్బ విశ్వేశ్వర్, ఇ రుకుల రవి, తోట సురేశ్, శివకుమార్ పాల్గొన్నారు.