వరంగల్, నవంబర్ 18: రుణం తీసుకునేందుకు జీడబ్ల్యూఎంసీ వడివడిగా అడుగులు వేస్తున్నది. నగర సమ్రగ్రాభివృద్ధి కోసం బ్యాంకు రుణం తీసుకోవాలన్న మున్సిపల్ శాఖ సూచనల మేరకు కావాల్సిన కసరత్తును చకచకా పూర్తి చేస్తున్నది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే అతి ముఖ్యమైన కౌన్సిల్ తీర్మానం లేఖను మున్సిపల్ శాఖకు పంపించాలి. అప్పుడే అప్పు తీసుకోవడంలో ముఖ్య ఘట్టం పూర్తవుతుంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగరాభివృద్ధి కోసం రూ.90 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలన్న తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, గ్రేటర్‌కు అప్పు ఇచ్చేందుకు రెండు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సీడీఎంఏలు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కౌన్సిల్ చేసిన తీర్మానపత్రాన్ని వెంటనే పంపించాలని గ్రేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగైదు రోజులుగా మేయర్ అందుబాటులో లేకపోవడంతో తీర్మానం పంపించడంలో జాప్యం జరిగినట్లు సమాచారం. బ్యాంకు ద్వారా రుణం తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదం పొందిన తీర్మానాన్ని లేఖ రూపంలో మరో వారం రోజుల్లో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించేందుకు గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మొదట పబ్లిక్ ఇష్యూ బాండ్స్ విడుదల చేయాలని మున్సిపల్ శాఖ భావించింది. దానిని విరమించుకుని రుణం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నది. ఇప్పటికే ఇండియా రేటింగ్ సంస్థ గ్రేటర్ వరంగల్‌కు ‘ ఏ మైనస్’ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రూ.వంద కోట్ల లోపు బాండ్స్ విడుదల చేసే అవకాశం సాధించింది. లేదా రుణం పొందే అర్హత జీడబ్ల్యూఎంసీకి ఉంది.
ముందుకొచ్చిన రెండు బ్యాంకులు
గ్రేటర్‌కు రుణం మంజూరు చేసేందుకు రెండు బ్యాంకులు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఐసీఐసీఐ, హెడీఎఫ్సీఐ బ్యాంకు లు రుణం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే, గ్రేటర్ ఎస్బీఐతోపాటు ఈ రెండు బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తున్నది. దీంతో రుణం ఇచ్చేందుకు రెండు ప్రైవేట్ బ్యాంకులు ముందుకొచ్చాయి. ఇందులో ఏదైనా బ్యాంకును మున్సిపల్ అధికారులు ఎంపిక చేయనున్నారు.
బాండ్స్ వద్దు.. రుణం వైపే మొగ్గు
హైదరాబాద్, ఇండోర్, ముంబై, పుణె కార్పొరేషన్ల తరహాలో పబ్లిక్ ఇష్యూ బాండ్స్ మార్కెట్లోకి నిధులు సమీకరించుకోవాలని గ్రేటర్ అధికారులు మొదట భావించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను గత కమిషనర్లు చేపట్టారు. చెన్నైకి చెందిన ఇండియా రెటింగ్ ఏజెన్సీతో గ్రేటర్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఖర్చులు, అభివృద్ధికి వెచ్చిస్తున్న నిధులను లెక్కిస్తూనే భవిష్యత్ అర్థిక స్థితిని అంచనా వేస్తూ నివేదికను అందజేసింది. జీడబ్ల్యూఎంసీ ప్రస్తుత అర్థిక స్థితిపై ఇండియా రేటింగ్ ఏజెన్సీ ‘ఏ మైనస్’ రేటింగ్ ఇచ్చింది. అయితే ‘ ఏ మైనస్’ పై ఉన్న కార్పొరేషన్లు రూ. వంద కోట్ల లోపు, ‘ ఏ ’ రేటింగ్ వస్తే వంద కోట్లకు పైగా బాండ్స్ లేదా రుణం తీసుకునే అవకాశం ఉంది. ‘ ఏ మైనస్ ’ రేటింగ్ ఉన్న గ్రేటర్ రూ. 90 కోట్ల రుణం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నది.
ఇప్పటికే హైదరాబాద్ కార్పొరేషన్ బాండ్స్ విడుదల చేయగా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ‘ ఏ మైనస్ ’ రేటింగ్‌తో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ బాండ్స్ కాకుండా రుణం తీసుకోవడం వైపు మొగ్గు చూపుతున్నది. పబ్లిక్ ఇష్యూ బాండ్స్ వైపు వెళితే ప్రతి నెల సెబీకి నివేదికలతోపాటు ప్రతి మూడు నెలలకు గ్రేటర్ ఆర్థిక పురోగతిపై నివేదిక అందజేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ బాండ్స్ విడుదల చేయడం, మంచి ప్రాజెక్టు ఎంపిక చేయడం కీలకంగా మారనుంది. రిస్క్ చేయడం ఎందుకు అన్నట్లు గ్రేటర్ అధికారులు రుణం తీసుకోనేందుకే మొగ్గు చూపుతున్నారు.
రూ.148 కోట్లతో ప్రాజెక్టు రిపోర్ట్
గ్రేటర్ రూ.90 కోట్ల రుణం కోసం రూ.148 కోట్లకు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసింది. తీసుకునే రుణం ఏ అభివృద్ధికి ఖర్చు చేయనున్నారనే వివరాలను ప్రాజెక్టు రూపంతో పొందు పరిచారు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తామో తెలిపారు. వాటర్ సైైప్లె, రిక్రియేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆదాయం సమకూర్చుకునే ప్రాజెక్టులతో పాటు ప్రజా రవాణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఖర్చు చేస్తామని ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 11 ప్రాజెక్టులపై రూ.148 కోట్లతో నివేదిక రూపొందించారు.
నీటి సరఫరాకు రూ. 20 కోట్లు
తాగునీటి సరఫరాను సూక్ష్మంగా పర్యవేక్షించేందుకు ‘ స్కాడా’ విధానం ద్వారా రూ. 20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రాజెక్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. స్కాడా విధానంలో ప్రతి ఓవర్ హెడ్ ట్యాంకును ఆన్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అక్కడి నుంచే తాగునీటి సరఫరాను సూక్ష్మస్థాయిలో పర్యవేక్షిస్తారు. తాగునీటి సరఫరా జరిగే సమయంలో ఎక్కడ లీకేజీ జరుగుతుంది అనేది కంట్రోల్ రూం నుంచే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం గ్రేటర్లో అమలు చేయనున్నట్లు రుణం తీసుకునేందుకు రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్‌లో పొందుపరిచారు.
రిక్రియేషన్ సౌకర్యాలకు రూ. 28 కోట్లు
ప్రజల ఆహ్లాదం కోసం పలు చోట్ల సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రూ. 8 కోట్లు బంధం చెరువు బండ్ అభివృద్ధి, రూ.10 కోట్లు హనుమకొండ చౌరస్తాలో ప్లాజా నిర్మాణం, రూ. 10 కోట్లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో థీమ్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు రిపోర్టులో చూపారు.
సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్కు రూ. 35 కోట్లు
సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రూ.35 కోట్లు ఖర్చు చేస్తామని నివేదికలో పొందుపరిచారు. నిర్మాణం, కూల్చివేతల ద్వారా వచ్చే వ్యర్థాలతో వస్తు తయారీ ప్లాంట్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
కన్స్ట్రక్షన్ అండ్ డామాలేషన్ వ్యర్థాల ద్వారా టైల్స్, కర్బూ టైల్స్ తయారీ చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దాని ద్వారా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. మరో 20 కోట్లతో ఇంటింటి నుంచి సేకరిస్తున్న ఫ్రెష్ చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రాసెసింగ్ యూనిట్‌కు ఖర్చు చేయనున్నట్లు చూపారు. గ్రేటర్లో మరో రెండు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 5 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
ఆదాయం సమకూర్చుకునే ప్రాజెక్టులకు రూ. 45 కోట్లు
గ్రేటర్‌కు ఆదాయం సమకూర్చే ప్రాజెక్టులను రిపోర్టులో సూచించారు. హనుమకొండలోని అశోకా టాకీస్ ఎదురుగా ఉన్న కార్పొరేషన్ స్థలంలో రూ. 15 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రాజెక్టు రిపోర్టులో పొందుపరిచారు. హంటర్‌రోడ్‌లోని సైన్స్ సెంటర్ పైన సోలార్ పార్కు ఏర్పాటు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చూపారు. అలాగే, కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ప్లానిటోరియం పునరుద్ధరణ కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఓసిటీ, రంగంపేట ప్రాంతాల్లో స్విమింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా కార్పొరేషన్‌కు అదాయం సమరూరుతుందని చూపింది.
ప్రజా రవాణా వ్యవస్థకు రూ. 20 కోట్లు
ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ బస్స్టేషన్ల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు చూపారు.