వరంగల్, ఫిబ్రవరి 19(నమస్తేతెలంగాణ) : మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే మొదటి దశలో అభివృద్ధి చేసే పాఠశాలల ఎంపిక జరిగింది. మండలానికో ఇంజినీరింగ్ ఏజెన్సీని కేటాయిం చారు. దీంతో ఆయా మండలంలో ఎంపిక చేసిన ప్రభు త్వ పాఠశాలల్లో అవసరాలను సదరు ఇంజినీరింగ్ ఏజెన్సీలు గుర్తిస్తున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధి పను లు జరిగే పాఠశాల పనుల లావాదేవీలు, విరాళాల వినియోగం కోసం వేర్వేరుగా బ్యాంకు ఖాతాలను తెరవడం కూడా మొదలైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ మూడు విడుతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. తొలి విడుత ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న 33శాతం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 645 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 223 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను మొదటి దశలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిం ది. వీటిలో మండలం వారీగా చెన్నారావుపేటలో 17, దుగ్గొండిలో 15, గీసుగొండలో 14, ఖానాపురంలో 11, ఖిలావరంగల్లో 19, నల్లబెల్లిలో 16, నర్సంపేటలో 20, నెక్కొండలో 25, పర్వతగిరిలో 17, రాయపర్తిలో 21, సంగెంలో 17, వర్ధన్నపేటలో 12, వరంగల్లో 19 స్కూళ్లు ఉన్నాయి. మొదటి దశలో ఎంపికైన 223 పాఠశాలల్లో ప్రాథమిక స్కూళ్లు 123, ప్రాథమికోన్నత పాఠశాలలు 20, ఉన్నత పాఠశాలలు 80 ఉన్నట్లు విద్యాశాఖ జిల్లా అధికారి వాసంతి వెల్లడించారు.
మండలానికో ఇంజినీరింగ్ ఏజెన్సీ..
తొలి విడుత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల జాబితా కొద్దిరోజుల క్రితం జిల్లా అధికారులకు అందింది. ఈ నేపథ్యంలో ఆయా మండలంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కలెక్టర్ బీ గోపి మండలానికో ఇంజినీరింగ్ ఏజెన్సీని ఎంపిక చేశారు. జిల్లాలోని పదమూడు మండలాలకు పదమూడు ఇంజినీరింగ్ విభాగాలను ఏజెన్సీలుగా కేటాయించారు. ఈ విభాగాల్లోని ఇంజినీర్లు, విద్యాశాఖ అధికారులతో ఈ నెల 16న కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో మొదటి దశలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై సమావేశంలో ఇంజినీర్లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం అమలుపై ఇంజినీర్ల సందేహాలను కూడా నివృత్తి చేశారు. దీంతో సదరు ఇంజినీర్లు కలెక్టర్ తమకు కేటాయించిన మండలంలో తొలివిడుత అభివృద్ధి చేసేందుకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో ముందుగా అవసరాలను గుర్తించే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి ఆయా పాఠశాలను సందర్శిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీతో కలిసి పాఠశాల వారీగా అవసరాలను గుర్తించి ఎస్టిమేట్స్ వేస్తున్నారు. వీటిలో చేపట్టాల్సిన పనులను పాఠశాల నిర్వహణ కమిటీ నిర్ణయించి తీర్మానం చేయనుంది. పాఠశాలల్లో అవసరమైన అన్ని అంశాలను కలిపి ఒక ప్రాజెక్టుగా పరిగణించి పనులు చేపట్టేందుకు కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇస్తారు. తొలి దశలో ఎంపికైన 223 ప్రభుత్వ పాఠశాలల్లోనూ సాధ్యమైనంత త్వరలో పనులు చేపట్టే దిశగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.
లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు..
అభివృద్ధి చేసేందుకు మొదటి దశలో ఎంపిక చేసిన 223 పాఠశాలల్లో లావాదేవీల కోసం వేర్వేరుగా రెండు బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో చేపట్టే పనుల లావాదేవీల కోసం ఒకటి, దాతలు, పూర్వవిద్యార్థులు, ఇతరుల నుంచి సేకరించిన విరాళాల వినియోగం కోసం మరో ఖాతా తెరిచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్థానిక సర్పంచ్, మండల ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేర పాఠశాల పనుల లావాదేవీల బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు పర్యవేక్షణకు మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం అమలుపై ఈ నెల 21తర్వాత ఎస్ఎంసీలకు సమావేశాలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నేడు సన్నాహక సమావేశం..
ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బీ గోపి ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, జడ్పీ చైర్పర్సన్, గ్రంథాలయ చైర్మన్తో పాటు జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొంటారు. మొదటి విడుత జిల్లాలో ఎంపిక చేసిన 223 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నది. పర్యవేక్షణకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం.