భీమదేవరపల్లి, ఫిబ్రవరి 18 : జిల్లాలోని సమ్మక్క-సారలమ్మ మినీజాతరలు శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. తల్లులకు నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి ములుకనూరు, కొత్తకొండలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ దొంతరవేన వెంకటేశ్వర్లు, సర్పంచ్ మాడుగుల కొంరయ్య, వార్డుసభ్యులు, జాతర పాలకవర్గం నిరంతరం సేవలందించింది. ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఎస్సైలు సురేశ్, పరమేశ్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అమ్మవారిపేట జాతరలో..
మడికొండ : గ్రేటర్ 44వ డివిజన్ పరిధిలోని అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. పూజారులు లక్ష్మీదేవికి ఒడి బియ్యం సమర్పించారు. సమ్మక్క పూజారి బౌరిశెట్టి శ్యాంసుందర్, సారక్క పూజారి నామని శివమూర్తి తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, శాప్ మాజీ డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి మంత్రి కేటీఆర్ కటౌట్‌ను తులాభారం వేసి 75కిలోల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. 1098 చైల్డ్‌లైన్ జిల్లా కమిటీ సభ్యుడు జాతరలో చైల్డ్లైన్పై అవగాహన కల్పించారు. జాతరలో చేపడుతున్న బందోబస్తును కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు.
కోరినకోర్కెలు తీర్చే సమ్మక్క-సారలమ్మ
నడికూడ : కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క-సారలమ్మ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడి ్డ అన్నారు. కంఠాత్మకూరు, పులిగిల్లలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలను ఆయన సందర్శించి మొక్కులు చెల్లించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క తల్లి భక్తుల కొంగు బంగారం అయిందన్నారు. అనంతరం జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. కంఠాత్మకూరు సర్పంచ్ రేకుల సతీశ్, పులిగిల్ల సర్పంచ్ పాలకుర్తి సదానందం, జడ్పీటీసీ కోడెపాక సుమలత కరుణాకర్, ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్. పార్టీ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, మాదారం సొసైటీ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, జాతర కమిటీ చైర్మన్ మేకల రంజిత్, పార్టీ మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి, నందికొండ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ మేకల సతీశ్, సుదాటి వెంకటేశ్వర్రావు, గుడికందుల శివ, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
దామెరలో..
ఎల్కతుర్తి : మండలంలోని దామెరలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులుదీరారు.తల్లులకు బెల్లం, పంచదార, కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా జాతర పూజారి మద్దె భూమయ్య అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పలు గ్రామాలతో పాటు అన్నసాగర్ తదితర గ్రామాల నుంచి భారీగా భక్తులు జాతరకు తరలివచ్చారు. కాగా, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతర ప్రాంగణంలో మంచినీరు, విద్యుత్, మెడికల్ క్యాంపు తదితర సదుపాయాలను నిర్వాహకులు కల్పించారు. ఎల్కతుర్తి ఎస్సై పరమేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, జాతర కమిటీ చైర్మన్ సాతూరి భాస్కర్, సర్పంచ్ చల్లా రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కడారి భిక్షపతి, ఎంపీటీసీలు వేముల రజిని, గొర్రె ఆదాం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పీచర గ్రామంలో..
వేలేరు : పీచర గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఎత్తు బంగారం, కుంకుమ భరిణె సమర్పించి మొక్కులు చెల్లించారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారావు, ఆత్మ జిల్లా చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ మ్యాక రవీందర్, ఉపసర్పంచ్ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ జల్తారు సంపత్, జాతర కమిటీ చైర్మన్ ఎల్లయ్య, కోఆప్షన్ సభ్యుడు జానీ, గ్రామశాఖ అధ్యక్షుడు పోలు తిరుపతి, నాయకులు విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.