ఆత్మకూరు, ఫిబ్రవరి 18 : రెండో మేడారంగా విరాజిల్లుతున్న అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతర అశేష భక్త జనంతో పోటెత్తింది. గద్దెలపై కొలువుదీరిన తల్లుల దీవెనలు పొందేందుకు శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొబ్బరికాయలు, ఒడి బియ్యం, నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమలతో గంటల తరబడి క్యూలైన్లతో బారులు తీరారు. క్యూ లైన్లు కిక్కిరిసి పోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. గద్దెలకు ఇరువైపులా ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లో నిలబడ్డారు. భక్తులు ఒక్కసారిగా రావడంతో జాతర ప్రాంగణం జన గుడారంగా మారింది. కానుకలతో గద్దెలు నిండిపోయాయి. అమ్మవార్లకు ఎదురుకోళ్లను సమర్పించారు. అనంతరం సల్లంగా చూడాలి తల్లి అంటూ వేడుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వచ్చి తల్లులను దర్శించుకున్నారు. జాతర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 30లక్షల మంది భక్తులు అగ్రంపహాడ్‌కు వచ్చినట్లు అధికారులు, పోలీసులు అంచనా వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుస్తుగా డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శివరామయ్య, సీఐ గణేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
తల్లులను దర్శించుకున్న ప్రముఖులు
అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ వెంకటలక్ష్మి, మాజీ మంత్రి కొండా సురేఖ శుక్రవారం తల్లులను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీవో చేతన్కుమార్రెడ్డి, ఎంపీపీ సుమలత, సర్పంచ్ మాదాసి అన్నపూర్ణ, జాతర కమిటీ చైర్మన్ గుండెబోయిన రాజన్న, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య, జాతర డైరెక్టర్లు గుమ్మడి మల్లయ్య, పూజారి రామన్న, రాయరాకుల శంకర్, పెండ్లి రాజు, శీలం సాంబయ్య, కత్తెరశాల మల్లేశం పాల్గొన్నారు.
సీసీ, డ్రోన్లతో పర్యవేక్షణ
జాతరలో పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరాను వినియోగిస్తూ ఎప్పటికప్పడు ఉన్నతాధికారులకు జాతర సమాచారాన్ని అందజేశారు. జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును డీసీపీ వెంకటలక్ష్మి పరిశీలించారు. డ్రోన్ కెమెరా ఆపరేటర్ పవన్‌కృష్ణ, సీఐ గణేశ్, ఎస్సైలు ప్రసాద్, సుమన్ ఉన్నారు. డ్రోన్ కెమెరాను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
అగ్రంపహాడ్ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని పరకాల ఆర్డీవో వాసుచంద్ర అన్నారు. జాతర ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 15 రోజుల నుంచి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్వరగా పనులు పూర్తిచేసినట్లు చెప్పారు.
తిరుగు ప్రయాణంలో భక్తులు
అగంపహాడ్ జాతర నుంచి భక్తులు క్రమంగా గ్రామాలకు చేరుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో జాతరకు వచ్చిన భక్తులు శుక్రవారం గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకుని, తిరుగు ప్రయాణమయ్యారు.
నేడు వన ప్రవేశం
గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. పూజారులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేపట్టి, తల్లులకు వీడ్కోలు పలుకనున్నారు.
మాస్కులు తప్పకుండా ధరించాలి
దామెర: అగ్రంపహాడ్ జాతరకు వచ్చే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించి, రావాలని దామెర పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శిరీష సూచించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతరకు ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, కరోనా వైరస్ సోకకుండా జాతరలో ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పించిందన్నారు. ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. దగ్గు, జ్వరం ఉంటే జాతరలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో కరోనా పరీక్షలను చేయించుకుని, మందులను పొందాలని తెలిపారు.