వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 18: ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాదాసీదాగా కనిపించే వరంగల్ రైల్వే గూడ్స్‌షెడ్ జంక్షన్.. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చీకటి పడితే చాలు.. ఆ దారి పాదచారులు, వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. రాత్రి సమయాల్లో ఈ జంక్షన్ పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ బస్టాండ్ నుంచి రైల్వే గూడ్స్ షెడ్‌కు చేరుకోవడానికి నిర్మాణ దశలో ఉన్న రోడ్డు ప్రయాణాలకు అనుకూలంగా లేకపోవడం, మరోవైపు రాత్రి సమయాల్లో కార్యకలాపాలు సాగించని క్లబ్ భవనం, దాన్ని ఆనుకొని నిర్వహణ, పర్యవేక్షణ లేని పాలపిట్ట పార్కు, కూల్చి వేసిన మున్సిపల్ కాంప్లెక్స్, ఇంకో వైపు కొనసాగుతున్న భారీ నిర్మాణాలు, శిథిలావస్థకు చేరుకున్న రైల్వే భవనాలు. దీనికితోడు ఈ జంక్షన్ ఓ వైపు మిల్స్‌కాలనీ, మరో వైపు ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలోకి రావడం, గూడ్స్‌షెడ్ రైల్వే పోలీసుల పరిధిలో ఉండడం వల్ల పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో ప్రజల సంచారం పెద్దగా లేకపోవడంతో గూడ్స్‌షెడ్ జంక్షన్ అక్రమార్కులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనికితోడు ఈ ప్రాంతమంతా వీధిదీపాలు లేక అంధకారం అలుముకోవడం వారికి అనుకూలంగా మారుతున్నది. కార్పొరేషన్ అధికారులు వీధిదీపాలను ఏర్పాటు చేస్తున్నా కొందరు వ్యక్తులు వాటిని పని చేయకుండా చేసి ఆ ప్రాంతాన్నంతా అంధకారంలోనే ఉండేలా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సర్వసాధారణం..
గూడ్స్‌షెడ్ దారికి ఎలాంటి గేట్లు ఏర్పాటు చేయకపోవడం మూలంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయాల్లో ఆ దారి గుండా రైలు పట్టాలపై నుంచి శివనగర్ వైపునకు చేరుకుంటున్నారు. దీంతో స్థానిక పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు తెలుస్తున్నది. బస్టాండ్ ప్రాంతానికి ఈ జంక్షన్ అత్యంత సమీపంలో ఉండడం వల్ల అక్రమ మద్యం, జూదం, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ సర్వసాధారమైనట్లు చెబుతున్నారు. రాత్రి వేళల్లో అక్కడ ఎక్కువగా విటులతోపాటు మద్యంప్రియుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాహనదారులు, కూరగాయల వ్యాపారులు, అమ్మకాలు పూర్తి చేసుకొని వెళ్తున్న రైతులను ఆపి బెదిరించి నగదు అపహరణ, వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే గూడ్స్‌షెడ్ దారికి గేటు ఏర్పాటు చేసి సాధారణ ప్రజలను అందులోకి అనుమతించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీధిదీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో నిరంతరం పోలీసుల గస్తీ, నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.