చెన్నారావుపేట, ఫిబ్రవరి 14 : నెలన్నర చిన్నారి గుండెకు పెద్ద కష్టం వచ్చింది. బాబుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండెకు ఆపరేషన్ చేయాలని తేల్చారు. దీంతో రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు ఏ చేయాలో తోచక తల్లడిల్లుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన మూగల నవ్య- రాకేశ్ దంపతులకు నెల వయస్సున్న అబ్బాయి ఉన్నాడు. చిన్నారి తరుచూ జబ్బు పడుతుండడంతో తల్లిదండ్రులు ఇటీవల హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించి వైద్యులు అబ్బాయి గుండెకు సంబంధించిన రెండు కవాటాలు అతుక్కుని ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆపరేషన్ కూడా అత్యవసరంగా చేయాలని తేల్చి చెప్పారు. దీంతో ఆ పేద తల్లిదండ్రులపై పిడుగు పడ్డట్లయింది. పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితుల్లో ఉన్న వారు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక, కళ్లముందు అభం శుభం తెలియని చిన్నారి పడుతున్న బాధను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయాలని వేడుకుంటున్నారు. చిన్నారి తండ్రి మూగల రాకేశ్ ఫోన్నంబర్ 9550707038కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.