వర్ధన్నపేట, ఫిబ్రవరి 14 : కొత్తగా ఏర్పడిన వర్ధన్న పేట మున్సిపాలిటీలో ఆదాయాన్ని పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి పాలక మండలికి సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ అధ్యక్షతన జరిగిన వార్షిక బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ హాజరై బడ్జెట్ నివేదికపై సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయాలంటే, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వర్ధన్నపేట పట్టణానికి రూ.30కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఈ నిధులతో చేపట్టిన పనులన్నీ త్వరలోనే పూర్తిచేయాలని సూచించారు.
రూ.2.76కోట్ల అంచనా బడ్జెట్
మున్సిపాలిటీలో 2022-23 వార్షిక సంవత్సరంలో రూ.2.76కోట్ల అంచనా బడ్జెట్‌ను మున్సిపల్ కమిష నర్ గొడిశాల రవీందర్ ప్రవేశపెట్టారు. ఏడాదిలో రూ.2కోట్ల 71లక్షల 50వేలు ఖర్చు చేయగా, రూ.4లక్షల 50వేల మిగులు బడ్జెట్ ఉంటుందని అధికారులు అంచనా బడ్జెట్ నివేదికను తయారు చేశారు. బడ్జెట్‌కు సంబంధించిన ఆదాయ వనరులపై కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ పాలకమండలి, అధికారులతో సమగ్రంగా చర్చించారు. అలాగే ఆదాయాన్ని పెంచుకునేందుకు తగిన సూచనలు, సలహాలను అధికారులు పాలక మండలికి ఇచ్చారు. ప్రధానంగా ఇంటి, నల్లా, ఇతర పన్నుల వసూళ్లను వసూలు చేయాలని చెప్పారు. ఇందుకు అధికారులు, పాలక మండలి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి, సుధీర్, రవీందర్, పూజారి సుజాత, రామకృష్ణ, పాలకుర్తి సుజాత, పద్మ, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.