వరంగల్, ఫిబ్రవరి 7(నమస్తేతెలంగాణ) : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ నుంచే గాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. సమ్మక్క-సారలమ్మను జనం తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. అమ్మవార్లకు బెల్లం ప్రీతికరం. ఈ నేపథ్యంలో భక్తులు ముందుగానే తమ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తామని మొక్కుకుంటారు. మొక్కు తీర్చుకొనేందుకు బెల్లం దుకాణాలకు చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి నిలువెత్తు బంగారం కొంటారు. కొందరు తమ ఎత్తుకంటే కిలో రెండు కిలోల బెల్లం ఎక్కువే తీసుకుంటారు. నిలువెత్తు బెల్లంలో నుంచి ఒక ముద్ద లేదా కిలో కిలోపావు తమ వెంట మేడారం తీసుకెళ్లి దర్శనం సమయంలో అమ్మవార్లకు నైవేధ్యంగా సమర్పిస్తారు. సమ్మక్క-సారలమ్మకు చూపిన బెల్లాన్ని ప్రసాదంగా భావిస్తారు. దీన్ని వెంట తెచ్చి ఇంట్లో ఉన్న మిగతా బెల్లంలో కలిపి ప్రసాదంగా ప్రజలకు పంచిపెడుతారు.
కేరాఫ్ బీట్‌బజార్..
కొన్ని దశబ్దాల నుంచి వరంగల్‌లోని బీట్‌బజార్ బెల్లం అమ్మకాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సమీపించగానే బీట్‌బజార్‌లో బెల్లం నిల్వలు దిగుతాయి. ఈసారి మరింత ముందునుంచే ఇక్కడకు బెల్లం రావడం మొదలైంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా జాతరకు రెండు నెలల ముందు నుంచే మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ నెల 16న సారలమ్మ ఆగమనంతో జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే మేడారం సందర్శించిన భక్తుల సంఖ్య నలభై లక్షలు దాటింది. మేడారం జాతర సందర్భంగా వరంగల్ బీట్బజార్లోనే బెల్లం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బెల్లం కోసం బీట్బజార్కే వస్తారు. ఎలక్ట్రానిక్ కాంటాలపై కూర్చుని నిలువెత్తు బంగారం కొంటారు. దీన్ని ఇంటికి తీసుకెళ్లి మేడారం బయల్దేరే వరకు అమ్మవార్ల చిత్రపటాల వద్ద పెడుతారు. ప్రస్తుతం మేడారం జాతర సమీపించడంతో బెల్లం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బెల్లం కోసం వస్తున్న భక్తులతో బీట్‌బజార్ మినీ జాతరలా కనబడుతున్నది. భక్తుల నిలువెత్తు బంగారం తీసుకెళ్లే ఆటోలు, ఇతర వాహనాలతో రహదారులు రద్దీగా మారుతున్నాయి. సోమవారం బీట్‌బజార్, బట్టలబజార్, వరంగల్‌చౌరస్తా రోడ్లపై ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు నానాతంటాలు పడ్డారు. ఈసారి మేడారం జాతర కోసం మహారాష్ట్రలోని పూణే, లాతూరు, కర్నాటకలో మైసూర్ రూటులో ఉన్న మాంద్య నుంచి బెల్లం ఇక్కడకు వస్తున్నది. లారీల ద్వారా బెల్లం నిల్వలను వ్యాపారులు రాత్రివేళ దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి పలు దుకాణాల్లో నిలువెత్తు బంగారమే దర్శనిమిస్తున్నది.
అమ్మవార్లకు బంగారం అంటే ఇష్టం..
సమ్మక్క-సారలమ్మ మహత్యం గల తల్లులు. అం దుకే మేడా రం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. గుడి లేకుండా జాతర జరిగేది ప్రపంచంలో మేడా రం ఒక్కటే. అమ్మవార్లకు బంగారం అంటే ఇష్టం. మొక్కు తీర్చుకొనేందుకు భక్తులు తమ నిలువెత్తు బంగారం కొంటారు. కరోనా ప్రభావంతో ఈసారి ముందు నుంచే మేడారం వెళ్తున్నారు. బెల్లం అమ్మకాలు మొదలై నెల పదిహేను రోజులైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సహా అందరూ ఇక్కడ నిలువెత్తు బంగారం కొంటున్నారు. బీట్‌బజార్‌లో కొన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నం.
-చందా రాజేశ్వర్‌రావు, బెల్లం వ్యాపారి, బీట్‌బజార్
సమ్మక్క-సారలమ్మ మా ఇలవేల్పులు..
సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు మా ఇంటి ఇలవేల్పులు. తల్లుల దయతో మా కు మంచి జరుగుతున్నది. అం దుకే రెండేళ్లకోసారి మేడారంలో జరిగే జాతరకు కు టుంబ సభ్యులందరం వెళ్తాం. ప్రతిసారి అందరం నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పిస్తాం. నేను, అమ్మ, తమ్ముడు, చెల్లెళ్లు, కోడళ్లు అందరం కలిసి బెల్లం దుకాణం వద్దకొచ్చినం. నిలువెత్తు బంగారం 555 కిలోలు కొన్నం. దీన్ని ఇంట్లో అమ్మవార్ల ఫొటోల వద్ద పెడుతాం. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి వచ్చాక మేడారం వెళ్లి సమర్పించి మొక్కులు తీర్చుకుంటాం.
-గుండా అనిల్‌కుమార్, భక్తుడు, వరంగల్‌చౌరస్తా