వరంగల్/హనుమకొండ, ఫిబ్రవరి 6 : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నగర పర్యటన ఖరారైంది. ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం వరకు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హన్మకొండలోని ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన (జీఎంహెచ్)లో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలాజీ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సర్కారు దవాఖాన, పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు పూర్తిస్థాయి పరీక్షలు చేసేందుకు డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీలకు వచ్చే రోగుల శాంపిల్స్ సేకరించి డయాగ్నస్టిక్ హబ్‌లో ఉచితంగా పరీక్షలు, రేడియాలజీలో ఎక్స్‌రే, స్కానింగ్‌లు చేయనున్నారు.
జీఎంహెచ్‌లో మదర్ మిల్క్ బ్యాంక్..
ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన (జీఎంహెచ్)లో రూ.కోటితో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్‌ను మంత్రి హరీశ్రావుప్రారంభించనున్నారు. ఇందులో తల్లిపాలను నిల్వ చేయనున్నారు. పుట్టిన శిశువుల తల్లికి పాలు పడకపోతే మదర్ మిల్క్ బ్యాంక్‌లో నిల్వ చేసిన పాలను అందించనున్నారు. జిల్లాలో దీన్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారు. బ్లడ్ స్టోరేజ్ యూనిట్, క్షయ వ్యాధికి సంబంధించిన స్పెషల్ క్లినిక్‌ను, ఉదయం 10.45 గంటలకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో పిడియాట్రిక్ ఐసీయూ యూనిట్‌ను మంత్రి ప్రారంభిస్తారు. చింతగట్టు క్యాంపులోని బీజీఆర్ రాక్ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్లనున్నారు.