ధర్మసాగర్, జనవరి 29 : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. మండలంలోని రాయగూడెం గ్రామంలో రూ.24లక్షలు, తాటికాయలలో రూ.7లక్షలు, పెద్దపెండ్యాలలో రూ.19లక్షలు, ఎలుకుర్తి పరిధి రామన్నగూడెంలో రూ.5లక్షలు, నర్సింగరావుపల్లెలో రూ.8లక్షలు ఉపాధి నిధులతోపాటు ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంజూరు చేసిన రూ.75లక్షలతో గ్రామాల్లో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాల పనులకు ఎమ్మెల్యే రాజయ్య శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధితోపాటు రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ఎం రజిని, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, ఎంపీపీ కవిత, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ జీ రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజమణి, రమేశ్, అన్నమ్మ, అరుణ, చిర్ర రజిత, వైఎస్ ఎంపీపీ రవీందర్, వైస్ చైర్మన్ యాదకుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ కరంచంద్, ఎంపీటీసీలు సోమక్క, నాగయ్య, పీఆర్ ఏఈ భిక్షపతి, ధర్మపురం గ్రామ అధ్యక్షుడు బైరపాక బాలస్వామి, ఉప సర్పంచ్ మహేశ్ పాల్గొన్నారు.