వర్ధన్నపేట, జనవరి 29: పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేటలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్కు పలు సూచనలు చేశారు. పట్టణంలో జరుగుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతడితో మాట్లాడి పనులు వేగంగా జరిగేలా చూడాలని సూచించారు. అలాగే, పట్టణ అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రణాళిక ఆధారంగా చేపట్టాల్సిన పనులను కూడా త్వరగా ప్రారంభించాలన్నారు. అంతేకాకుండా పట్టణంలో పన్ను వసూళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణంలో టాయ్లెట్లు, రహదారులు పరిశుభ్రంగా ఉండేలా నిత్యం పారిశుధ్య సిబ్బందితో పనులు చేయించాలన్నారు. వ్యాపారులు, చికెన్ సెంటర్ల నిర్వాహకులు, దుకాణాదారులు రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. పట్టణ సుందీకరణ కోసం రహదారులకు ఇరువైపులా, జఫర్గఢ్ రోడ్డు మధ్యలో నాటిన మొక్కలకు నీరందిస్తూ సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్ రవీందర్ తదితరులు ఉన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ..
ఖానాపురం: మేడారంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన ఆదివాసీ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొంది నాగేశ్వర్రావు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ చేతుల దుగా కరపత్రాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో కల్తీ ఎల్లయ్య, గొంది అశోక్, కిరణ్, సారంగపాణి పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనుల పరిశీలన..
మండలంలోని కమ్మపల్లి గ్రామంలో డీఆర్డీఏ విజిలెన్స్ అధికారి మాధవి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ప్రధాన రహదారులు, సైడ్ కాల్వలు, పారిశుధ్యం, ట్రీగార్డ్స్ ఏర్పాటు, నర్సరీ, విలేజ్ పార్కు పనులను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. నర్సరీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, మొక్కల పెంపకంపై శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, కార్యదర్శి మహేశ్, కారోబార్ శ్రీనివాస్, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.