వర్ధన్నపేట, జనవరి 28: హరితహారంలో భాగంగా రహదారుల వెంట నాటిన మొక్కల సంరక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మండలంలోని కట్య్రాల గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కలను ఆయన శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షలాది రూపాయల వ్యయంతో వాతావరణ సమతుల్యత, సుందరీకరణ కోసం రహదారుల వెంట మొక్కలు నాటిస్తున్నదన్నారు. వాటి సంరక్షణకు వన సేవక్‌లను నియమించి ఈజీఎస్ ద్వారా వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది వనసేవక్లతో విధిగా మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పల్లెప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
చెన్నారావుపేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిమ్మరాయినిపహాడ్ సర్పంచ్ కొండవీటి పావని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె గ్రామంలో జీపీ సిబ్బంది చేస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించి రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పట్టారు. సర్పంచ్ వెంట కార్యదర్శి మమత, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ కొండవీటి ప్రదీప్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రెడ్డిమాస్ కిశోర్, వార్డు సభ్యుడు మంద చిన్ను, జీపీ సిబ్బంది గిరిబాబు, సతీశ్, బెల్లంకొండ ఇన్నయ్య ఉన్నారు.