వరంగల్, జనవరి 6(నమస్తేతెలంగాణ) : క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఆశ కార్యకర్తలకు సంక్రాంతి పండుగ ముందు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిం ది. నెలవారి ప్రోత్సాహకా(ఇన్సెంటివ్)లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. 30 శాతం పెంచుతూ గురువా రం ఉత్తర్వులు విడుదల చేసింది. కమిషనర్ ఆఫ్ అం డ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న ఆశ కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరికి నెలవారీ ప్రోత్సాహకాలు రూ.7,500 నుంచి రూ.9,750కి పెరుగనున్నాయి. పెంచిన ఇన్సెంటివ్లు ఈ ఏడాది జూన్ నుంచి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలో 673 మం దికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం 30శాతం ఇన్సెంటివ్ పెంచడంపై ఆశ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి వీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో స్థానికంగా ఉండి ప్రజలకు మేమున్నామం టూ ధైర్యాన్నిచ్చారు. వైరస్ బారిన పడిన జనం ఇళ్లకు వెళ్లి సేవలందించారు. ఇంటింటా జరిగిన జ్వర సర్వేలో కీలకపాత్ర పోషించారు. గ్రామాలు, పట్టణాల్లో కరోనా సోకిన, లక్షణాలతో బాధపడిన వారికి మెడికల్ కిట్లను అందజేశారు. కీలక సమయంలో విస్తృత సేవలందించి ప్రశంసలు పొందారు.
సంతోషంగా ఉంది..కూచన జ్యోతి, ఆశ కార్యకర్త, గీసుగొండ
గీసుగొండ : తెలంగాణ ప్రభుత్వం ఆశ వర్కర్లకు ప్రోత్సాహకాలు పెంచడం సంతోషంగా ఉంది. మాకు గుర్తింపు లభించినట్లయింది. సీఎం కేసీఆర్ మాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటాం. ప్రజలకు మా వంతు సేవలు అందిస్తాం.
ఇకపై రెట్టించిన ఉత్సాహంతో విధులు
రాజేశ్వరి, ఆశ కార్యకర్త, రాయపర్తి
రాయపర్తి : కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న ఆశ వర్కర్ల సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి నెలవారీ ప్రోత్సాహకాన్ని 30శాతం పెంచడం ఆనందదాయకం. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తాం. పెంపు ప్రకటనతో ఆశ వర్కర్లకు సంక్రాంతి పండుగ ముందస్తుగా వచ్చినట్లుంది.
పెంపు ప్రకటన సంతృప్తినిచ్చింది..తండా పావని, ఆశ కార్యకర్త, కన్నారావుపేట, నల్లబెల్లి
నల్లబెల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు నెలవారీ ప్రోత్సాహకాలు 30శాతం పెంచుతున్నట్లు ప్రకటించడం సంతృప్తినిచ్చింది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించడాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మరింత బాధ్యతను పెంచింది. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.