నెక్కొండ, డిసెంబర్ 15: అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వాసంతి హెచ్చరించారు. గురువారం ఆమె మండలంలోని నాలుగు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముగ్గురు ఉపాధ్యాయులు అనుమతులు లేకుండానే విధులకు డుమ్మా కొట్టారు. ఈ నెల 8న ఎంపీపీ జాటోత్ రమేశ్ నాలుగు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఏడుగురు ఉపాధ్యాయులు అనుమతి లేకుండానే విధులకు రాలేదు. ఎంపీపీ అందించిన నివేదికను ఎంపీడీవో రవి డీఈవోకు అందించారు. ఈ మేరకు ఏడుగురు టీచర్ల ఒకరోజు వేతనాన్ని డీఈవో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సమావేశంలో సీరియస్‌గా విద్యా శాఖపై చర్చ జరిగిన నేపథ్యంలో డీఈవో సూర్యతండా, దూద్యతండా, బడితండా, అజ్మీరామంగ్యాతండా ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అజ్మీరామంగ్యాతండా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, బడితండా పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు హాజరు కాలేదని డీఈవో తెలిపారు. పాఠశాలల్లో తనిఖీలను ముమ్మరం చేసి పరిస్థితిని చక్కదిద్దుతామని స్పష్టం చేశారు.
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై డీఈవో గురువారం వేటు వేశారు. ఈ నెల 8న ఎంపీపీ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంలో గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బడితండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఆర్ రవి, ఎల్ రాజు, అజ్మీరామంగ్యాతండాకు చెందిన కే వంశీకృష్ణను సస్పెండ్ చేసినట్లు డీఈవో వెల్లడించారు. కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు స్కూళ్లను విధిగా తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకొని తమ పరిధిలోని అంశాలను జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు అలసత్వం ప్రదర్శిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం చేయాలి
ఖిలావరంగల్: జిల్లాస్థాయి జవహర్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, సైన్స్, గణిత టీచర్లు విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో సూచించారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి ప్రదర్శన జనవరి మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన అంశం ‘టెక్నాలజీ అండ్ టాయ్స్’తోపటు ఉప అంశాలు పర్యావరణ హిత పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, సాప్ట్వేర్, రవాణా, పర్యావరణం, వాతావరణ మార్పులు, గణిత మోడలింగ్‌పై ఎగ్జిబిట్లను ప్రదర్శించొచ్చని వివరించారు. వివరాలకు 9848878455 నంబర్లో సంప్రదించాలని సూచించారు.