నయీంనగర్, డిసెంబర్ 19 : కాకతీయ యూని వర్సిటీ పోలీసుల అదుపులో ఉన్న ఓ దొంగ సోమవారం ఉదయం పారి యా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ మండలం రాయపర్తికి చెందిన చిదిరిక అరవింద్ గతంలో బీమారం పెద్దలైన్ వద్ద బైక్ దొంగతనం చేసి పారిపో యాడు. అయితే, అదే బైక్‌పై కరీంనగర్ మీదుగా వెళ్తున్న క్రమంలో బైక్ యజమాని స్నేహితులు బైక్‌ను గుర్తించారు. అరవింద్‌ను ఆపి విచారించి కేయూసీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఐడీ పార్టీ పోలీసులు కరీంనగర్ నుంచి బైక్‌తో పాటు అరవింద్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది.
15రోజులుగా లాకప్‌లోనే..
బైక్ దొంగ అరవింద్‌ను 15 రోజులుగా స్టేషన్‌లోని లాకప్‌లోనే ఉంచి విచారి స్తున్నట్లు తెలిసింది. సోమ వారం ఉదయం 7.30 గంటలకు బాత్రూం పోయి వస్తానని అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌కు చెప్పి వెళ్లాడు. బాత్రూం వెళ్లినట్టే వెళ్లి అక్కడే ఉన్న గోడ దూకి పారిపోయినట్లు సమాచారం. పారిపోయిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
60కి పైగా కేసులు..
పారిపోయిన అరవింద్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో 60కిపైగా కేసులు ఉన్నాయి. ఇతడి వద్ద మూడు రోజు లుగా ఒకే కానిస్టేబుల్ రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆదివారం రాత్రి సమయంలో ప్రతి రోజు తనతో మరో కానిస్టేబుల్‌ను ఉంచండి అని సదరు కానిస్టేబుల్ అధికారులను అడిగి నట్లు సమాచారం.
త్వరలో పట్టుకుంటాం
పారిపోయిన దొంగకోసం ప్రత్యేకమైన బలగాలు రంగంలోకి దిగాయి. త్వరలోనే దొంగను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నిందితుడు ఎక్కడ ఉన్న విడిచి పెట్టేది లేదు. ఇప్పటికే అతడిపై చాలా కేసులు ఉన్నాయి. స్టేషన్ నుంచి పారిపోయి మరో తప్పు చేశాడు.
-దయాకర్, కేయూ సీఐ