వరంగల్, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ) : ఆర్థికంగా మైనారిటీలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు ఇవ్వడానికి నిధులు కేటాయించింది. ఈ మేరకు 2022-23 సంవత్సరం కోసం అర్హులైన మైనారిటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్లైన్ ద్వారా సోమవారం నుంచి స్వీకరిస్తున్నది. జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. మైనారిటీ కమ్యూనిటీల ఆర్థికాభివృద్ధ్ది, సాధారణ అభ్యున్నతి కోసం వ్యాపార యూనిట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందజేస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని మైనారిటీలకు రెండు కేటగిరిల కింద రూ.96 లక్షల విలువ చేసే 74 యూనిట్లను మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేసింది. వీటిలో రూ.లక్ష యూనిట్లు 52, రూ.2 లక్షల యూనిట్లు 22 ఉన్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి కే విక్రమ్‌కుమార్ వెల్లడించారు.
రూ.లక్ష యూనిట్లో 80 శాతం, రూ.2 లక్షల యూనిట్లో 70 శాతం సబ్సిడీగా ప్రభుత్వం ఇవ్వనున్నదని ఆయన తెలిపారు. రూ.లక్ష యూనిట్లో 20 శాతం, రూ.2 లక్షల యూనిట్లో 30 శాతం బ్యాంక్ లింకేజీ అని, దీన్ని లబ్ధ్దిదారులు తమ వాటాగా ముందుగానే జమ చేయాల్సి ఉందని విక్రమ్‌కుమార్ చెప్పారు. ఈ యూనిట్లను పొందడానికి ముస్లింలు, సిక్కులు, పార్సీలు, బౌద్ధ్దులు, జైనులు అర్హులని, దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం వారైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతం వారైతే రూ.2 లక్షల లోపు ఉండాలని, దరఖాస్తుదారులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం సమర్పించాలని ఆయన తెలిపారు.
తెల్లరేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు దారులు అర్హులు. ఆసక్తి గల మైనారిటీ దరఖాస్తుదారులు ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టం(ఓబీఎంఎంఎస్) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19 నుంచి జనవరి 5 వ తేదీ వరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, జనవరి 5 తర్వాత ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడవని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన యూనిట్లలో 33 శాతం మహిళలకు, 5 శాతం దివ్యాంగులకు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సబ్సిడీ రుణాలను పొందడానికి కుటుంబం నుంచి ఒకరే అర్హులని, గత ఐదేళ్లలో ప్రభుత్వ సబ్సిడీ రుణాలు తీసుకున్న లబ్ధ్దిదారులు వీటికి అనర్హులని వెల్లడించారు.
సబ్సిడీ రుణాల యూనిట్లు ఇవే
రూ.లక్ష విలువ చేసే కేటగిరి-1లో 36 సెక్టార్లలో లబ్ధిదారులు వ్యాపార యూనిట్లను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వీటిలో అత్తరు, సూర్మ, ఆల్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ బిజినెస్, బుర్ఖా అమ్మకాలు, తయారీ, సిల్వర్ ఫాయిల్, చండీ పేపర్ తయారీ, అమ్మకం, ఫిజియోథెరపి, బ్యూటీఫార్లర్, సెల్‌ఫోన్ సర్వీసింగ్, వెల్డింగ్ షాపు, స్ప్రే పెయింటింగ్ అండ్ టింకరింగ్ షాపు, జ్యూస్ సెంటర్, హోంమేడ్ స్నాక్స్, స్వీట్స్, మసాల పౌడర్లు, పచ్చళ్ల అమ్మకం, మినీ ఫ్లోర్ మిల్లు, వెట్ గ్రైండర్, స్లాబ్ కటింగ్, గ్రానైట్, మిల్క్ బూత్, బుక్ బైండింగ్, ప్రింటింగ్ ప్రెస్, టీ, టిఫిన్ సెంటర్, సీటు కవర్స్, రెగ్జిన్ వ ర్క్స్, కార్పెంటరి, టైలరింగ్ వర్క్, జిరాక్స్ సెంటర్, మినరల్ వాటర్ సైప్లె, హ్యాండిక్రా ఫ్ట్స్ అమ్మకం, ప్రిం టింగ్ వర్క్స్, మ్యాచింగ్ సెం టర్, కిరాణం, జనరల్ స్టోర్స్, లేడీఎస్ ఎంపోరియం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బిజినెస్, బ్యాగుల వ్యాపా రం, ఫినాయిల్, డిటర్జెంట్స్, శానిటైజర్స్ అమ్మకం, సబ్మెర్సిబుల్ పంపు, ఎలక్ట్రానిక్ మోటర్ల రిపేరు, బార్బర్, పాన్‌షాప్, టూ అండ్ ఫోర్ వీలర్ మెకానిక్, డిస్పోజల్ ప్రొడక్ట్సు ఉన్నాయి.
రూ.2 లక్షల విలువ చేసే కేటగిరీ-2లో 16 సెక్టార్లలో బిజినెస్ యూనిట్లను లబ్ధిదారులు పొందవచ్చని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి విక్రమ్‌కుమార్ తెలిపారు. వీటిలో ఎలక్ట్రీషియన్ లేదా ఏసీ మెకానిక్, స్టేషనరీ షాపు, ఫుట్‌వేర్ పుష్ కార్టు, సీసీ టీవీ సర్వీసెస్, ఆటోమొబైల్ స్పేర్ పార్టుల అమ్మకం లేదీ సర్వీసింగ్, బేకరీ, ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, మొబైల్ టిఫిన్ సెంటర్ లేదా ఫాస్ట్ ఫుడ్, చికెన్, మటన్ సెంటర్, మీట్ షాపు, ఆప్టికల్ షాపు, జిమ్ అండ్ ఎక్విప్మెంట్, టెంట్ హౌస్, క్యాటరింగ్ యూనిట్, సౌండ్ సిస్టం, లైటింగ్ అండ్ డెకరేషన్, సెంట్రింగ్ లేదా ఆర్సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్, రెడ్ చిల్లి గ్రైండింగ్ యంత్రం తదితర యూనిట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
గ్రామసభల ద్వారా ఎంపిక
మైనారిటీ సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ ద్వారా చేసిన దరఖాస్తులు ఆయా మండల ఎంపీడీవోలకు చేరుతాయి. వీటిని స్క్రీనింగ్ కమిటీలు పరిశీలించి గ్రామసభల్లో పెడుతాయి. గ్రామాల్లో జీపీ కార్యదర్శులు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు గ్రామసభల్లో పాల్గొంటారు. గ్రామ సభల ఏకాభిప్రాయంతో మైనారిటీల సబ్సిడీ రుణాల యూనిట్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జనవరి 10వ తేదీలోగా గ్రామ సభలు జరగాల్సి ఉంది. ఈ జాబితాలు ఎంపీడీవోల ద్వారా జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీకి చేరుతాయి. కలెక్టర్ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ చైర్మన్‌గా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, లీడ్ బ్యాంకు మేనేజర్, జడ్పీ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఎంపీడీవోల నుంచి వచ్చిన జాబితాలను ఈ కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేయనున్నది. జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఆమోదం తెలిపిన జాబితాలోని లబ్ధ్దిదారులకు సబ్సిడీపై రుణాలు అందనున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో అర్హులైన మైనారిటీలు సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు.