భీమదేవరపల్లి, నవంబర్ 19: కొప్పూరు చిన్న గ్రామమే అయినా.. చారిత్రకంగా ఎంతో గొప్పది.. 2500 మంది జనాభా ఉన్న ఈ ఊరు అంతులేని వారసత్వ సంపదను తన ఒడిలో దాచుకున్నది. కొప్పు.. పూర్వం ఊరి గుట్టపై కట్టిన మట్టి కోట గోడలు తలకు కొప్పులా ఉండేవని, కొప్పు ఉన్న ఊరు కొప్పూరులా మారిందని గ్రామస్తులు అంటున్నారు.
శివాలయంలో సూర్యభగవానుడు
గ్రామానికి నడిబొడ్డున పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయంలో ధ్వజ స్తంభం శిథిలావస్థకు చేరడంతో అప్పటి మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కొత్తగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించి ఆలయానికి మరమ్మతులు చేయించారు. ఈ ఆలయ ఆవరణలో హనుమంతుడి విగ్రహం ఉంది. గర్భాలయంలో చతురస్రాకారపు పానవట్టం మీద సమతల శిరోవర్తుల లింగం ఉన్నది. శివాలయంలో నలువైపులా గణపతి, సూర్యుడు, దుర్గామాత, నాగబంధ శిల్పాలున్నాయి. గర్భాలయంలో పైకప్పుపై అష్టభుజ భువన శిల్పం, లలాటబింబంగా గణపతి ఉన్నాడు. గర్భాలయానికి సూచీ, హస్తాలతో శైవద్వారపాలకులున్నారు. ఇక్కడి నందీశ్వరుడి విగ్రహం చాళుక్యుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. కాగా సూర్యభగవానుడి శిల్పాలు మన ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇక్కడ సప్త అశ్వాలపై ఆసీనుడైన సూర్యభగవానుడి విగ్రహాన్ని గ్రామస్తులు మునీశ్వరుడిగా భావించి పూజలు చేస్తున్నారు.
అమ్మదేవతా శిల్పం
గ్రామానికి తూర్పునభాగాన మల్లన్న ఆలయం ఉంది. ఏటా యాదవులు ఇక్కడ ఉత్సవాలు జరిపిస్తారు. ఆలయం వెలుపల అతి పురాతనమైన శిల్పం అస్పష్టంగా ఉంది. యాదవులు ఈ విగ్రహానికి రంగులు వేసి పూజలు చేస్తున్నారు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది అమ్మదేవత విగ్రహం కావచ్చునని కొత్త తెలంగాణ చరిత్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. విగ్రహం ఎవరిదో తెలియకున్నా ప్రాచీన కాలం నుంచీ ఉండడంతో గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. పురాతన శివలింగ పానవట్టం అమ్మదేవతా శిల్పం పక్కన ఉండగా శివలింగం మాత్రం గుడిలో ఉంది. శివలింగం పైనే మరో లింగాన్ని ప్రతిష్టించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఆలయానికి వెనుకభాగాన ఒక వేపచెట్టు కింద శాసనం లాంటి రాయి ఉన్నది. దానికి రంగులు పూయడంతో లిపి కనిపించడం లేదు. మొత్తంగా చారిత్రక వారసత్వ సంపద కలిగిన ఈ గ్రామం ఎంతో విశిష్టతను కలిగి ఉన్నది.
మర్రి ఊడల్లో కూరుకుపోయిన భైరవుడు
గ్రామానికి దక్షిణం వైపు వాగు ఉంది. దీని సమీపంలో మర్రి ఊడల్లో ఉన్న తొర్రలో పోచమ్మ ఆలయం ఉంది. ఏటా గ్రామస్తులు పోచమ్మకు ఘనంగా బోనాలు తీస్తారు. అయితే పోచ మ్మ విగ్రహం తొర్రలో కనిపించదు. మర్రి ఊడల్లోనే విగ్రహం కూరుకుపోయినా ఏటా ఇక్కడే పోచమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. ఇదే చెట్టుకు మరో పక్కన భైరవుడి విగ్రహం ఉంది. మర్రి ఊడల్లో చిక్కుకుని సగం వరకు భూమిలో కూరుకుపోయింది. విగ్రహం తలలో జ్వాలాకేశాలు, చెవులకు కుండలాలు, పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలం, నిజహస్తాల్లో గద ఉండగా మరో చేయి భూమిలో కూరుకుపోయింది. విగ్రహానికి కపాలాల జంధ్యం ఉన్నది. విగ్రహాన్ని పరిశీలిస్తే 11వ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తున్నది. భైరవుడి విగ్రహానికి కొంత దూరంలో మెట్లబావి ఉండేది. భైరవుడి విగ్రహం ఉన్న ప్రాంతంలో పురాతన ఆలయం ఉన్నట్లు తెలుస్తున్నది. పుష్కరిణిలో స్నానం చేసి ఆలయంలో భక్తులు పూజలు చేసేందుకు అనుకూలంగా మెట్లబావిని తవ్వించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమంలో మెట్లబావిని వ్యవసాయం కోసం మోటబావిగా మా ర్చి వినియోగించినట్లు తెలుస్తోంది. మెట్లబావి ప్రమాదకరంగా మారడంతో పూర్తిగా పూడ్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఊరగుట్టపై కోటగోడలు
గ్రామంలోని ఊరగుట్ట 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గుట్టపై అబ్బురపరిచే మట్టి కోట గోడలు ఉన్నాయి. 12ఫీట్ల వెడల్పు, 24ఫీట్ల పొడవుతో శత్రుదుర్బేధ్యంగా మట్టి గోడలు నిర్మించారు. కాకతీయ రాజు గణపతి దేవుడు 12వ శతాబ్దంలో ఈ మట్టి గోడలు కట్టించినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. గుట్టపై సువిశాల ప్రదేశం ఉంది. ఎత్తుపల్లాలుగా ఉన్న గుట్టపై భాగాన్ని సమాంతరం చేసేందుకు ఆ కాలంలోనే పెద్ద ఎత్తున మొరం పోసిన ఆనవాళ్లున్నాయి. గ్రామంలో చాలా వరకు ఈ మట్టిగోడలను కూల్చి గ్రామస్తులు ఎడ్లబండ్ల ద్వారా మట్టిని ఇంటి గోడలకు వినియోగించారు. చారిత్రక సంపద నేలమట్టం కావద్దని గ్రామస్తులు భావించడంతో మిగిలి ఉన్న కోట గోడలను ఎవరు పెకిలించినా చర్యలు తప్పవని గ్రామ పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. గుట్టపై నుంచి చూస్తే చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నాయి. ఊర గుట్ట పక్కనే బురుజు ఉంది. దోపిడీలు, దొంగతనాలు జరుగకుండా ఈ బురుజుపై కాపలాదారులు ఉండేవారు. గ్రామంలో ఏటా దసరా ఉత్సవాలు ఈ బురుజు వద్దే ప్రారంభం అవుతాయి.