గోదావరి కరకట్టకు చకచకా మరమ్మతులు
మొన్నటి వర్షాకాలంలో వరదల ధాటికి కోతకు గురైన ఏటూరునాగారం-రామన్నగూడెం గోదావరి కరకట్ట మరమ్మతులు మొదలయ్యాయి.
- ఇటీవలి వరదలకు కోతకు గురైన ఒడ్డు
- 125 మీటర్ల పొడవుతో కట్టకు సపోర్టుగా మట్టి
- కోతకు గురికాకుండా రివిట్మెంట్
- రూ.80 లక్షలతో పనులు
ఏటూరునాగారం, నవంబర్ 19: మొన్నటి వర్షాకాలంలో వరదల ధాటికి కోతకు గురైన ఏటూరునాగారం-రామన్నగూడెం గోదావరి కరకట్ట మరమ్మతులు మొదలయ్యాయి. నీటి ప్రవాహ వేగానికి కట్టకు ఉన్న రివిట్మెంట్ బండలు పూర్తిగా నదిలో కుంగి కొట్టుకుపోవడమే గాక ఏటూరునాగారం, రామన్నగూడెం గ్రామాలు ముంపులో చిక్కుకొని విలవిల్లాడాయి. ఒక దశలో దెబ్బతిన్న కట్ట కూడా కొట్టుకుపోతుందని ఆందోళన చెందగా పెను ప్రమాదం తప్పింది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కరకట్టను పట్టిషంగా నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేయగా రూ.80లక్షలతో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
గోదావరి వరద తాకిడికి కుంగిపోయిన కరకట్ట మరమ్మతులను నీటి పారుదలశాఖ అధికారులు ప్రారంభించారు. గత జూలైలో వచ్చిన వరదలకు ఏటూరునాగారం-రామన్నగూడెం మధ్యలోని గోదావరి కరకట్ట దెబ్బతిన్నది. మూలమలుపు వద్ద కరకట్ట కోతకు గురై మట్టి కొట్టుకుపోయింది. కట్టకు ఉన్న రివిట్మెంట్ బండలు పూర్తిగా గోదావరిలో కుంగిపోయి కొట్టుకుపోయాయి. సుమారు 15 మీటర్ల మేర ఒడ్డు పూర్తిగా కోతకు గురైంది. ఒక దశలో కట్టకు గండిపడుతుందని ఆందోళన చెందారు. ఇక గోదావరి వరద ఎక్కువగా రావడంతో ఏటూరునాగారం, రామన్నగూడెం గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. దెబ్బతిన్న కట్ట కూడా కొట్టుకుపోతుందని భావించినప్పటికీ అదృష్టవశాత్తు నిలబడింది. దీంతో ఈ రెండు గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కట్టతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన ప్రభుత్వం తక్షణ మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కరకట్ట మరమ్మతుకు రూ.80 లక్షలు మంజూరు కాగా, వర్షాలు పూర్తిగా తగ్గడంతో కరకట్ట పనులను సదరు కాంట్రాక్టర్ చేపడుతున్నారు.
గతంలో ఉన్న కట్టకు గోదావరి వైపు 125 మీటర్ల పొడవు, 10 మీటర్ల ఎత్తు మట్టి పోసి ఒడ్డు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కట్ట పటిష్టంగా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుంచి టిప్పర్ల ద్వారా మట్టి తెప్పిస్తున్నారు. పోసే మట్టి కోతకు గురై కొట్టుకుపోకుండా ఉండేందుకు రాయితో కట్ట నిర్మిస్తున్నారు. కొత్తగా పోస్తున్న మట్టి పైభాగంలో ఐదు మీటర్ల వెడల్పు ఉండేలా పనులు జరుగుతున్నట్లు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. పోసే మట్టిని ఎప్పటికప్పుడు డోజర్లు, జేసీబీలతో లెవల్ చేస్తూ రోలింగ్ చేస్తున్నారు. కట్ట పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కుంగిన ప్రదేశంలో కట్ట పని పూర్తి కాగానే రివిట్మెంట్ పనులు పూర్తిచేస్తామని నీటి పారుదల శాఖ ఈఈ జగదీశ్ తెలిపారు.
కట్ట మరమ్మతుతో తప్పనున్న ముప్పు
అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణం స్పందించి గండిపడుతుందనకున్న ప్రదేశంలో మరమ్మతులు చేపట్టడంతో ఏటూరునాగారం, రామన్నగూడెం ప్రజలు ఊపరిపీల్చుకున్నట్లు అయింది. సకాలంలో స్పందించకుంటే వచ్చే వర్షాకాలంలో వరదలు వస్తే ఈ రెండు గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా మిర్చి సాగు చేసే భూములపై కూడా ప్రభావం పడి ఇసుకతో నిండిపోయేవని రైతులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం గోదావరి కరకట్ట మరికొన్ని చోట్ల కూడా ప్రమాదకరంగా ఉన్నందున వాటిని కూడా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. రామన్నగూడెం పుష్కరఘాట్కు ఎగువ భాగంలో కూడా పది మీటర్ల వెడల్పుతో ఒడ్డు కొట్టుకుపోయింది. క్రమంగా ఏటా వరద తాకిడికి కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నందున అధికారులు ఇక్కడ రివిట్మెంట్ చేసి ఒడ్డు కుంగిపోకుండా ముందస్తుగా పనులు చేపట్టాలని రామన్నగూడెం రైతులు కోరుతున్నారు. అలాగే మండలకేంద్రంలోని ఓడవాడ శివారులో కూడా ఇలాంటి ప్రమాదమే ఉన్నందున అధికారులు స్పందించాలని ఏటూరునాగారం ప్రజలు వేడుకుంటున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

