నర్సంపేట, నవంబర్ 19: విద్యార్థులు పాఠశాలలకు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవో వాసంతి సూచించారు. నర్సంపేటలోని హన్మాన్దేవల్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ కరోనా కాలంలో చాలా మంది విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని తెలిపారు. ఒకటో తరగతి నుంచి విద్యార్థులు నేరుగా మూడో తరగతికి వచ్చారన్నారు. కానీ, విద్యార్థులు చదువులో వెనుకబడినట్లు గుర్తించామన్నారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈవో కోరారు. కరోనా కాలంలో విద్యార్థులు ఇంటి వద్ద ఉండడం, పాఠశాలకు దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు.
విద్యార్థులను తీర్చిదిద్దేందుకే ‘తొలిమిట్టు’
ఆన్లైన్లో పాఠాలను కొందరు విద్యార్థులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని డీఈవో వాసంతి తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థులు రోజూ పాఠశాలకు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. పిల్లలు నిత్యం పాఠశాలలకు రావడం వల్ల ప్రత్యేక తరగతుల్లో టీచర్లు చెప్పే అంశాలను జాగ్రత్తగా వింటూ ముందుకు సాగాలన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమంతప్పకుండా పాఠశాలలకు పంపించాలని కోరారు. విద్యార్థులు నష్టపోయిన బేసిక్స్‌ను మళ్లీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నేర్పుతున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా వినియోగించుకోవాని సూచించారు. విద్యార్థుల పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, హెచ్ఎంలు రాంచందర్‌రావు, మర్థ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, జడ్పీఎస్ఎస్, మోడల్ స్కూల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న డీఈవో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై ఉపాధ్యాయులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
పోచమ్మమైదాన్: విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని ఉపాధ్యాయులు అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ ప్రతినెల జరిగే పేరెంట్స్ మీటింగ్‌లో ఉపాధ్యాయులకు తగిన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు హరికృష్ణ, బాలగంగాధర తిలక్, నవీన్‌కుమార్, నర్సింగరావు, అలీ, రమేశ్, శ్రవణ్‌కుమార్, వేణుమాధవ్, నీరజ, స్వప్న పాల్గొన్నారు. అలాగే, సాయంత్రం నిర్వహించిన బాలసభలో రీడ్ అండ్ రైట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.