వర్ధన్నపేట, నవంబర్ 12: ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలో నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తోపాటు బస్టాండ్, తదితర ప్రదేశాలను శనివారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వివిధ రకాల పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా అధికారులు పనులను పూర్తి చేయించలేకపోవడం సరికాదన్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పాలకమండలి కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గడువు దాటినా పనులు పూర్తి చేయకపోవడంపై ఆమె కాంట్రాక్టర్‌ను వివరణ కోరారు. అనంతరం ఆమె మున్సిపల్ కార్యాలయ భవనానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. అలాగే, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి, రామకృష్ణ, రవీందర్, మున్సిపల్ ఇంజినీర్ అనిల్ పాల్గొన్నారు.
పల్లెప్రకృతి వనాల పరిశీలన
రాయపర్తి: నూతనంగా నిర్మించిన బృహత్ పల్లెప్రకృతి వనం, మండలకేంద్రంలోని విలేజ్ పార్కును అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ఆకస్మికంగా సందర్శించారు. తొలిసారిగా మండలానికి వచ్చిన ఆమె ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి మండలకేంద్రం శివారు రాయపర్తి-తిర్మలాయపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మెగా పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా బృహత్ పల్లెప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మొక్కల వివరాలు, ఖర్చు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలోని విలేజ్ పార్కును డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావుతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు గుగులోత్ అశోక్‌నాయక్, బెట్టపల్లి రాకేశ్, దామెరుప్పుల శాంతిరాజు, అజ్మీరా వెంకటేశ్‌నాయక్, నల్లతీగల సంతోష్‌కుమార్, సిబ్బంది బైరి వరుణ్, అయిత ఉమ, కారుపోతుల రాంచంద్రయ్య, రత్నాకర్ పాల్గొన్నారు.