కరీమాబాద్/గిర్మాజీపేట, సెప్టెంబర్ 4: పరిశుభ్రతతోనే రోగాలు దూరమవుతాయని కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన అన్నారు. వరంగల్ 32, 39, 40, 41, 42 డివిజన్లలో ఆయా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. ఇంటి ఆవరణలు, పాత పాత్రలు, డ్రమ్ముల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, జీడబ్ల్యూఎంసీ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో పది గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత టైర్లు, కూలర్లు, పగిలిన బకెట్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. తద్వారా చికున్‌గున్యా, డెంగీ, మలేరియా వంటి హానికర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ సజాంరాజు, మలేరియా సిబ్బంది, డివిజన్ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.