వరంగల్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత పెరిగింది. రాజకీయంగా ఈ ప్రాంతానికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ వరంగల్ నేతలకు అవకాశాలు ఇస్తుండగా తాజాగా ఎమ్మెల్సీ ఎంపికలోనూ వరంగల్ ఉమ్మడి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్కు పూర్తి ఆధిక్యత ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే కేంద్ర ఎన్నికల సంఘం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనుంది. ఎమ్మెల్యే కోటా ఆరు స్థానాల్లో సీఎం కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీగా అవకాశం పొందారు. సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. అలాగే టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ కానున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు మధుసూదనాచారి నియామక ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. కొత్తగా అవకాశం పొందిన ఈ నలుగురితో పాటు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మరో ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సత్యవతి రాథోడ్, బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సత్యవతి రాథోడ్‌కు మొదట ఎమ్మెల్సీగా, తర్వాత మంత్రిగా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ తరుపున పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ ఏడాది ఎన్నికయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఎన్నికవుతున్న వారితో కలిపి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలుగా ఉండనున్నారు. శాసనమండలిలో వరంగల్ ఉమ్మడి జిల్లా వారికే అధిక ప్రాధాన్యత దక్కిందని.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన అవకాశాలతోనే ఇది సాధ్యమైందని టీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయంగా విశేష ప్రాధాన్యం..
రాష్ట్ర సాధన ఉద్యమంలో, టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో వరంగల్ ఉమ్మడి జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమ ప్రతి దశలోనూ ఓరుగల్లు ముందుండి నడిచింది. అధినేత కేసీఆర్ ఇక్కడినుంచే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా కేసీఆర్‌కు వరంగల్ ఉమ్మడి జిల్లా మొదటినుంచీ సెంటిమెంట్‌గా మారింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే పరంపర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అనేక పథకాలను ఇక్కడినుంచే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ముద్ర(లోగో)లో కాకతీయ కళాతోరణాన్ని చేర్చారు. చెరువుల ఆధునీకరణ కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ పేరు పెట్టారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని సీఎం అయిన తర్వాత తొలిసారి నగరంలోనే ప్రకటించారు. ఉద్యమ సమయంలో ములుగు సమీపంలోని గుర్తూరు తండాలోని గిరిజన కుటుంబం పరిస్థితి చూసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్యాణలక్ష్మిని ప్రవేశపెట్టారు. వరంగల్‌లోని పరిస్థితులను స్ఫూర్తిగా తీసుకుని ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు పెన్షన్లు ప్రారంభించారు.