వరంగల్, నవంబర్ 22(నమస్తేతెలంగాణ) : ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మొదటి సెట్‌ను, మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రెండో సెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ బీ గోపికి అందించారు. పోచంపల్లి తరఫున చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ సుధారాణి ఒక సెట్, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, కుసుమ జగదీశ్వర్, పాగాల సంపత్‌రెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. శాసనమండలి వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 23న తుది గడువుగా నిర్ణయించారు. దాఖలైన నామినేషన్లను 24న పరిశీలిస్తారు. 26న ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. హనుమకొండలోని వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్నది.
టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తరఫున నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోచంపల్లి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, నర్సంపేట, డోర్నకల్ ఎమ్మెల్యేలు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పార్టీ నేతలు సతీష్‌రెడ్డి, జీ కేశవరావు, గాంధీనాయక్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. నామినేషన్ వేసిన పోచంపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా హనుమకొండలోని మంత్రి ఎర్రబెల్లి క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. 2019 జూన్‌లో శాసనమండలి వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోలుకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం జనవరి 4న ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌రెడ్డి రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇదే స్థానం నుంచి రంగంలో దిగారు.
మరో ఇద్దరి నామినేషన్
వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామస్తుడు వేం వాసుదేవారెడ్డి ఒక సెట్, నెల్లికుదురు మండలం నైనాల గ్రామస్తుడు పెరుమండ్ల గట్టయ్య రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. నామినేషన్ స్వీకరించిన అనంతరం ఎన్నికల అధికారులు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.