ఖిలావరంగల్, జూన్ 16 : ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఫర్టిలైజర్స్, ప్రైవేట్ డీలర్లు, కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బఫర్ స్టాక్ యూరియా 17260 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2278 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 1926 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 112 మెట్రిక్ టన్నులు, 9387 టన్నుల కాంప్లెక్స్ ఎరువు ఉందన్నారు. ఫర్టిలైజర్ లేజర్స్ ఉపయోగించడం వల్ల భూసారం కోల్పోయి పంట వ్యాధులకు గురి అవుతోందన్నారు. రసాయన ఎరువులు వాడకం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. భూసారాన్ని బట్టి రైతులు ఎకరాకు ఎంత ఎరువులు ఉపయోగించాలి.. నాణ్యమైన వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలపై తెలుగులో ఫ్లెక్సీలు తయారు చేయించి ఫర్టిలైజర్ షాపులు, రైతు వేదికల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించొచ్చని రైతులకు తెలిసే విధంగా ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సంపేట, వర్ధన్నపేట, ఏడీఏలు, పీఏసీఎస్ అధికారులు, ఆగ్రో రైతు సేవా కేంద్రం ప్రతినిధులు, హోల్సేల్, రిటైల్ ప్రైవేట్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.