వరంగల్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ మానస పుత్రిక, ఆత్మగౌవర ప్రతీకైన నమస్తే తెలంగాణ దినపత్రిక నేడు 12వ వసంతంలోకి అడుగిడుతున్నది. నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పనిచేసిన ఈ పత్రిక ప్రత్యేక ఆకాంక్షను ఎలుగెత్తి చాటింది. రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రజా సమస్యలపైనా యుద్ధం చేసింది. ఫీచర్లు, అన్ని అంశాలూ మేళవించిన వార్తలతో అశేష జనాదరణ పొంది గడిచిన పదకొండేళ్లలో ఎన్నో విజయాలను అందుకున్నది. 2011 జూన్ 6న పత్రిక ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలకు పతాకగా నిలిచింది. స్వరాష్ట్రం ఎందుకు కావాలో వివరంగా చెప్పింది. రాష్ట్ర సాధన కోసం పని చేస్తున్న వారి గొంతుకగా మారి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అయింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బంగారు తెలంగాణ సాధనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తున్నది. ప్రజల అవసరాలను తీర్చే విషయాల్లో ముందుంటున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల దరి చేరుస్తున్నది.
అవినీతి, అక్రమాలకు తావులేకుండా అధికార యంత్రాంగాన్ని జాగృతం చేస్తూనే.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరేలా చేస్తున్నది. ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలన వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చింది. సమైక్య పాలకులు, మీడియా చేస్తున్న దగాను బహిర్గతం చేసింది. నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేసిన ఉద్యమకారులకు వెన్నుదన్నుగా నిలిచింది. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కునారిల్లిన కులవృత్తులను వెలుగులోకి తెచ్చింది. మొదటినుంచీ రైతులు, కూలీలు, కార్మికులు, చిరువ్యాపారుల పక్షాన నిలిచింది. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై రాసింది. అధికారుల్లో అవినీతి, అక్రమాలను ఎండగట్టింది.
గతంలో డీసీసీబీలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నవారి కుటుంబాలకు అండగా నిలిచింది. నమస్తే తెలంగాణ వెల్ఫేర్ ఫండ్‌ను సమకూర్చి బాధిత కుటుంబాలకు అందజేసి కన్నీరు తుడిచింది. స్వరాష్ట్ర సాధన సమయంలో రాజకీయవేత్తలు, మేధావులతో చర్చాగోష్టులు పెట్టి వారి నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ఉద్యమకారులకు అందించింది. ఉమ్మడి పాలనలలో కనుమరుగైన వేల ఏళ్ల చరిత్రను వెలుగులోకి తెచ్చింది. ఆంధ్రా పాలనలో ఈసడింపునకు గురైన మన భాషను, యాసను సగర్వంగా ప్రచురించి ప్రపంచానికి చాటింది. మన తెలంగాణ తెలుగునే సినిమాలు, సీరియళ్లలో వాడే పరిస్థితి కల్పించింది. వివిధ శాఖల్లో అవినీతి పరుల తీరును ఎండగట్టింది. రెవెన్యూలో వేళ్లూనుకుపోయిన అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. ‘ధర్మగంట’ ద్వారా వందలాది మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించింది. ధరణి పోర్టల్‌పై సమగ్ర సమాచారాన్నిచ్చింది.
దవాఖానల దోపిడీ తీరును సైతం ఎండగట్టింది. విద్యాశాఖను గాడినపడేలా చేసింది. ఉపాధ్యాయుల సాధకబాదకాలను సైతం ప్రచురించింది. కుల, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు ఊతంలా నిలిచింది. రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నది. పథకాలు పకడ్బందీగా అమలుకావడంలో పెద్దన్నపాత్ర పోషిస్తున్నది. వివిధ పథకాలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా వివరిస్తున్నది. ప్రస్తుత కరోనా కాలంలోనూ ప్రజలను అప్రమత్తం చేయడంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నది. లేనిపోని భయాలను పోగొడుతున్నది. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నది. పేదల కష్టాలు, కన్నీళ్లకు అక్షర రూపం ఇస్తూ ప్రభుత్వం తరఫున సాయం అందేలా చేసింది. ప్రత్యేక ఫీచర్లతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. వివిధ వర్గాల వారి విజయగాథలు, వ్యవసాయ సమాచార వార్తలు, చారిత్రక ప్రదేశాలు, వింతలు, విశేషాలపై సమగ్ర కథనాలు ఇచ్చింది. ఎంతో మంది ఉమ్మడి జిల్లా కవులు, కళాకారులను పరిచయం చేసింది. మన సంప్రదాయాలు, ఆచారాలు, పల్లె జీవనం, జీవనశైలి, టెక్నాలజీ.. ఇలా ఎన్నింటినో ప్రజల ముందుంచింది.