వరంగల్ చౌరస్తా, జూన్ 5 : వైద్య వృత్తిపై ప్రజల్లో మరింత గౌరవం పెరిగే విధంగా వైద్య విద్యను పూర్తి చేసిన నేటితరం వైద్యులు సేవలందించాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ పిలుపునిచ్చారు. కేఎంసీ ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన 58వ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న 2016 బ్యాచ్‌కు చెందిన 250 మంది విద్యార్థులకు డాక్టర్ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెల కట్టలేని మనిషి ప్రాణాలను కాపాడడానికి ఆఖరి క్షణం వరకు పట్టు వదలకుండా ప్రయత్నించాలని సూచించారు. రెండు దశాబ్దాల కాలంలో వైద్య రంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుందని అన్నారు. శాస్త్రీయ పద్ధతిని పాటిస్తూ, ఆధునిక సాంకేతికతను వినియోగించి వైద్య సేవలు అందించడం మూలంగా మంచి ఫలితాలను అందుకోవచ్చని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం మూలంగా భవిష్యత్‌లో వైద్య వృత్తిలో రాణించడం సులభమవుతుందని ఆయన అన్నారు. విలువలతో కూడిన వృత్తిని ఎంచుకున్న మీరందరు దానికి మరింత వన్నె తీసుకొచ్చే విధంగా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఫొటోలు దిగారు. మిఠాయిలు పంపిణీ చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పరశురాం, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రాజారాం, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.