సుబేదారి, జూన్ 5 : పగలంతా ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలో పనిచేస్తూ, రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7.80 లక్షల విలువ చేసే 169 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుడి అరెస్టు వివరాలను సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కరజాడ గ్రామానికి చెందిన బలగ హరిబాబు ఇంజినీరింగ్ పూర్తి చూసి ఉపాధిహామీ పథకంలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తాళం వేసిన ఇళ్లలో 12 చోరీలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత ప్రముఖ ఫైబర్ నెట్వర్క్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హనుమకొండలో రెండు చోట్ల, కేయూసీ, హసన్‌పర్తి పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కో చోట చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలపై దృష్టి సారించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు హరిబాబుపై నిఘా పెట్టారు. ఆదివారం హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టైలర్స్ స్ట్రీట్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద 169 గ్రాముల బంగారం దొరికింది. విచారణ చేయగా నేరం ఒప్పుకున్నాడు. కేసులో ప్రతిభ చాటిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, క్రైం ఏసీపీ డేవిడ్ రాజ్, హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ వేణుమాధవ్, సీసీఎస్ సీఐ రమేశ్‌కుమార్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి అభినందించారు.