గిర్మాజీపేట, జూన్ 5: పట్టణప్రగతి కార్యక్రమం నగరంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. మూడో రోజు ఆదివారం కాలనీలు, వీధుల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. వరంగల్ 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ శిరీషాశ్రీమాన్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని నిజాంపుర డైమండ్ ఫంక్షన్ హాల్, ఉర్దూ మీడియం పాఠశాల ప్రాంతాల్లోని పరిసరాలను జీడబ్ల్యూఎంసీ కార్మికులతో శుభ్రం చేయించారు. 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో డివిజన్లోని బొడ్రాయి ప్రాంతంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏఈ సతీశ్, వర్క్ ఇన్స్పెక్టర్ అశోక్, అభినవ్, డివిజన్ అధ్యక్షుడు విజయభారత్, ప్రధాన కార్యదర్శి వోద్యరపు రాజేంద్రాచారి, దుర్గేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ ఎలకంటి సతీశ్, డైరెక్టర్ కూచన రమేశ్ పాల్గొన్నారు. 33వ డివిజన్ శాంతినగర్‌లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు డ్రైనేజీల్లోని చెత్తను తొలగించారు.
పారిశుధ్య సమస్యలు తలెత్తొద్దు
ఉర్సులోని నాగమయ్య ఆలయ ఆవరణలో పట్టణ ప్రకృతి వనంతోపాటు నర్సరీని ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పోశాల పద్మ అధికారులకు సూచించారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ మరుపల్ల రవి సిబ్బందిని కోరారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని కార్పొరేటర్ గుండు చందన తెలిపారు. కార్యక్రమంలో పోశాల స్వామి, గుండు పూర్ణచందర్, బజ్జూరి రవి, ఈదుల రమేశ్, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి 40వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పూజారి విజయ్ పాల్గొన్నారు. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్‌యాదవ్ ఏకశిల క్రీడామైదానం, దళితకాలనీ, పుప్పాల, బండి, యాదవవాడలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్రీడామైదానంలో బోరు ఏర్పాటు చేయాలని, పక్కనున్న స్థలంలో పార్కు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నరేందర్, ఇన్చార్జి శేఖర్, నాయకులు రావుల రాజేశ్, తోటకూరి నర్సయ్య, పోశాల సారంగపాణి, బొల్లం కార్తీక్, బండి శోభ, మిట్టపెల్లి కృష్ణవేణి, పిట్ట రమాదేవి, బండి కవిత, పోశాల అరుణ, పొన్నం శ్రీలత, బైరబోయిన మంజుల, గద్దల దయాకర్, వాటర్ లైన్మెన్ రాజేశ్, జవాన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే, 37వ డివిజన్లో కార్పొరేటర్ బోగి సువర్ణాసురేశ్ ఆధ్వర్యంలో అధికారులు పలు కాలనీలను సందర్శించారు. తూర్పుకోట పోచమ్మగుడి వద్ద కల్వర్టు నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, గిరిప్రసాద్‌నగర్ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, భిక్షపతి, ఫేరోజ్, రాజారం, హరిశంకర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ‘పట్టణప్రగతి’
స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ మసూద్ అన్నారు. 36వ డివిజన్ పరిధిలోని చింతల్లో ఆయన పర్యటించారు. సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, తాగునీటి సరఫరా, పైపులైన్ లీకేజీ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను కోరారు. కాశీబుగ్గ 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో కార్పొరేటర్ తూర్పాటి సులోచన ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మౌలిక వసతులపై వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పసులాది మల్లయ్య, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్ పాల్గొన్నారు. 12, 13వ డివిజన్ కార్పొరేటర్లు కావటి కవితారాజు యాదవ్, సురేష్‌జోషి ఆధ్వర్యంలో పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించారు.
పట్టణ పరిశుభ్రతకు సహకరించాలి
వర్ధన్నపేట: పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ చొరవ, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో ఇప్పటికే సగం వరకు పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ప్రజలు ఇష్టారాజ్యంగా చెత్తను బయట వేయొద్దని కోరారు. ఇంటి ముంగిట్లోకి మున్సిపాలిటీ వాహనం వచ్చినప్పుడు సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.