దుగ్గొండి, జూన్ 5: పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ కావాలని, అప్పుడే పల్లెలు సంపూర్ణ అభివృద్ధి సాధిస్తాయని డీఆర్డీవో సంపత్‌కుమార్ అన్నారు. దుగ్గొండి మండలంలోని చాపలబండ, నాచినపల్లి, పొనకల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్డీవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. డంపింగ్ యార్డుల్లో తయారు చేసిన వర్మీకంపోస్టును ఉద్యాన శాఖ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
రాయపర్తి: మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను పల్లెప్రగతి కార్యక్రమంలో వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్ పంచాయతీ పాలకవర్గాలకు సూచించారు. ఎంపీవో తుల రామ్మోహన్‌తో కలిసి ఆయన మండలంలోని మైలారం, రాయపర్తిలో పర్యటించారు. జీపీ సిబ్బంది చేస్తున్న పారిశుధ్య పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున కాలనీలు, వార్డులు, జనావాసాల్లో వరద, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పాలక మండళ్ల ప్రతినిధులు, కార్యదర్శులు, అధికారులు, గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు విధిగా పల్లెప్రగతి పనుల్లో భాగస్వాములు కావాలని కోరారు. అభివృద్ధి పనుల విషయంలో అలసత్వం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రాయపర్తి, మైలారంలో ఆయన గ్రామాల సర్పంచ్‌లు గారె నర్సయ్య, లేతాకుల సుమతీ యాదవరెడ్డి, కార్యదర్శులు గుగులోత్ అశోక్‌నాయక్, పెంచల విజేందర్, కారోబార్లు కారుపోతుల రాంచంద్రయ్య, గూడెల్లి ఉప్పలయ్యతో సమావేశమయ్యారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి ఉపాధిహామీ పథకంలో కూలీలు పేర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమాల్లో జీపీ సిబ్బంది తాటికాయల సమ్మయ్య, పద్మ, ఎల్లమ్మ, ఉప్పలమ్మ, పల్లె అభిషేక్, కొండేటి రాజు, సాంబరాజు, పిల్లి రాజు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నర్సంపేటరూరల్/ఖానాపురం: మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాములునాయక్‌తండా, గురిజాల, ముగ్ధుంపురం సర్పంచ్‌లు అజ్మీరా మాధవి, గొడిశాల మమత, పెండ్యాల జ్యోతి ప్రజలను కోరారు. మండలంలోని ముగ్ధుంపురం, లక్నేపల్లి, మహేశ్వరం, రాములునాయక్‌తండా, గురిజాల, చిన్నగురిజాల, గుంటూరుపల్లి, జీజీఆర్పల్లిలో జీపీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్‌లు కోరారు. ఖానాపురం మండలవ్యాప్తంగా పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఖానాపురంలో డ్రైనేజీల్లో పూడికతీత పనులను ఎంపీడీవో సుమనావాణి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిరంజీవి, కార్యదర్శి సుప్రజ పాల్గొన్నారు.
చికెన్ సెంటర్‌కు జరిమానా
పర్వతగిరి: మండలకేంద్రంలోని శ్రీనివాస చికెన్ సెంటర్ యజమానికి రూ. 1500 జరిమానా విధించినట్లు కార్యదర్శి రమేశ్ తెలిపారు. మండలకేంద్రంలో చికెన్ వ్యర్థాలను డంపింగ్ యార్డులో వేయడం, వృత్తి వ్యాపార లైసెన్స్ పొందకపోవడం వల్ల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. వ్యర్థాల నిర్వహణను సరిగా చేపట్టాలని నిర్వాహకులను సూచించారు.
పల్లెప్రగతి పనులు భేష్..
నల్లబెల్లి: మండలంలో చేపట్టిన పల్లెప్రగతి పనులు బాగున్నాయని డిప్యూటీ కమిషనర్ రామారావు కితాబిచ్చారు. కొండాపూర్‌లో పల్లెప్రగతి పనులను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనం, బృహత్ పల్లెప్రకృతి వనం, మంకీఫుడ్కోర్టు పనులను పరిశీలించి కార్యదర్శి రజిత, సర్పంచ్ గూబ తిరుపతమ్మను అభినందించారు. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లోని డైనేజీలను శుభ్రం చేయడంతోపాటు ఫాగింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, గ్రామాల సుందరీకరణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో కూచన ప్రకాశ్, ఏపీవో వెంకటనారాయణ, ఉప సర్పంచ్ మన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.