నమస్తే నెట్వర్క్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఆరు జిల్లాకేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఉత్సవాలకు అతిథులు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా హనుమకొండలో ‘జయజయహే తెలంగాణ’.. ‘ననుగన్న తల్లి.. నా జన్మభూమి’ పాటలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, ఎనిమిదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రగతి పథకంలో దూసుకెళ్తూ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నదని అతిథులు పేర్కొన్నారు.
ఖుష్‌మహల్ వద్ద ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో 510మంది ఉద్యమకారులను మంత్రి ఎర్రబెల్లి ఘనంగా సన్మానించారు.
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు.
చారిత్రక వరంగల్ కోటలో నిర్వహించిన ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఉజ్వల భవిష్యత్ కోసం చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ బీ గోపి పాల్గొన్నారు.
హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు పడ్డాయన్నారు. అనంతరం 72 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు. వేడుకల్లో మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, సీపీ తరుణ్‌జోషి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
ములుగు కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మండలి విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్‌రావు పాల్గొని జెండా ఎగురవేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను యావత్తు దేశం మొత్తం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జే సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జనగామ సమీకృత కలెక్టరేట్లో ప్రభుత్వ సలహాదారు జీ.ఆర్.రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు వ్యవసాయంలో నంబర్‌వన్‌గా ఉంది.. వరి దిగుబడిలో యావత్ దేశంలోనే రాష్ట్రం రికార్డు సృష్టిస్తే.. అందులో ఉమ్మడి వరంగల్‌లో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు ఇది నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు. వేడుకల్లో కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.