దామెర (ఆత్మకూరు), జూన్ 2 : తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు.. ఏనా డూ జయశంకర్ చిత్రపటానికి పూలదండ వేయలేదు. ఆయనదో బ్రోకర్ దందా.. టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నడు అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిప్పులు చెరిగారు. దామెర మండలంలోని ముస్త్యాలపల్లి జంక్షన్ వద్ద పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి గురువారం జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆత్మకూరు మండలం అక్కంపేటలో రూ.1.98 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. దుర్గంపేట నుంచి అక్కంపేట వరకు రూ.14.50 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం అక్కంపేటలో పల్లెప్రగతి- తెలంగాణ ఆవిర్భావ వేడుకల సభలో మాట్లాడారు.
కాంగ్రెస్ 50 సంవత్సరాలుగా మన ప్రాంతాన్ని దోచుకుతింది.. ఒకప్పుడు మన గ్రామాలు ఏ విధంగా ఉండేవో మీకు తెలుసు.. ఇప్పుడు మన రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే తప్పించుకుపోయిన దొంగ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ తన ప్రాణాలను కూడా లేక్కచేయలేదని.. ఆ భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌కు సిగ్గుండాలి.. రాష్ట్రం ఇచ్చిన అనే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. మన రాష్ట్రం మంచిగాగ ఉండాలనేది కోరుకున్నది ప్రొఫెసర్ జయశంకర్‌సార్… మరొకరు అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ తప్ప మరొకరు కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేసవిలో కూడా చెరువుల్లో నీరు ఉండేలా చేసిన మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు. గోదావరి, కృష్ణా నదిపై రూ.46 వేల కోట్లు పెట్టి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణంతో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.
రేవంత్‌ను చెప్పులతో కొట్టాలి..
అక్కంపేటలో ఏం అభివృద్ధి జరుగలేదని మాట్లాడిన టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ప్రజలు చెప్పులు, చీపురు కట్టలతో కొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. కొడంగల్‌లో అభివృద్ధిని పట్టించుకోని రేవంత్ ఇక్కడి అభివృద్ధిపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
ఆదర్శ గ్రామంగా అక్కంపేట.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
కాంగ్రెస్ హయాంలో అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ ఏపాటి అభివృద్ధి చేసిందో మీరు చూశారు. 8 ఏండ్లలోనే అక్కంపేట గ్రామాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డబ్బులు పెట్టి ఆ పదవి కొనుక్కున్నడు అని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అక్కంపేటపై ఉన్న ప్రేమే కారణమని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో కూడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, ఎంపీపీ కాగితాల శంకర్, మార్క సుమలతారజినీకర్, మచ్చ అనసూయ, జడ్పీటీసీలు గరిగె కల్పనాకృష్ణమూర్తి, పోలీసు ధర్మారావు, సుదర్శన్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనితారామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సారంగపాణి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, ఎనుమాముల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానందం తదితరులు పాల్గొన్నారు.