వరంగల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ) : సుమారు ఏడాదిన్నర నుంచి ఢిల్లీ వేదికగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించింది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలకు మద్దతుగా ఊరూరా కొనసాగిన ఆందోళనకు కేంద్రం దిగివచ్చింది. ఎట్టకేలకు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వెంటనే రైతుల్లో ఆనందం రెట్టించింది. సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్, రైతు సంఘాల నాయకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని విజయోత్సవ ర్యాలీలు తీశారు. వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయమని స్పష్టం చేశారు.
అన్నదాతలకు మద్దతుగా కొనసాగిన ఆందోళనలు
కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో వామపక్ష పార్టీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘాలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల ఎదుట దీక్షలు నిర్వహించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. ఆదినుంచీ రైతులకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను మొదటినుంచీ వ్యతిరేకించింది. ఈ చట్టాలతో రైతులు తాము పండించిన పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలని పలు వేదికలపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రైతులు తలుచుకుంటే చరిత్రలు మారుతయ్
వ్యవసాయ రంగానికి గుదిబండలా మారిన చట్టాలను రద్దు చేసేందుకు ఏడాది పాటు రైతులు పోరాడి విజయం సాధించారు.. రైతులు తులుచుకుంటే చరిత్రలే మారిపోతాయన్నది మరోమారు రుజువైంది.. నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేయడం ముమ్మాటికీ అన్నదాతల విజయమే.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాసటగా నిలిచి ఉద్యమం చేస్తానని గర్జించడంతో కేంద్రం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది.. ఇది సీఎం కేసీఆర్ పోరాట పటిమకు నిదర్శనం’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కురవి మండలంలోని కందికొండ, మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఇటీవలే నేను చెప్పిన.. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మరింత శక్తి నివ్వాలని భగవంతున్ని కోరుకుంటున్న. మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు టీఆర్ఎస్ మహాధర్నాతోనే పునాది పడింది. ఏడు దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరిక కోసం కాంగ్రెస్ మెడలు వంచిన కేసీఆర్, నేడు రైతులకు బాసటగా నిలిచి బీజేపీ మెడలు వంచారు..
ఉద్యమ నేపథ్యం కలిగిన సీఎం కేసీఆర్ చరిష్మా మరోసారి కేంద్రం మొండి వైఖరిని మార్చింది.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ర్టానికో తీరుగా వ్యవహరిస్తూ కర్షకుల కన్నీళ్లకు కారణమవుతున్నది. పంజాబ్‌లో ధాన్యం కొంటూ తెలంగాణలో ధాన్యం కొనబోమని అంక్షలు పెడుతున్నది. సమైక్య పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణను ప్రగతి బాట పట్టించింది సీఎం కేసీఆరే.. తెలంగాణలో ప్రగతిని ఓర్వలేని కేంద్రం, ఇక్కడి ధాన్యం కోనుగోళ్లపై కొర్రీలు పెడుతున్నది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం వైఖరిని నిరసిస్తూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధానిలో చేపట్టిన మహధర్నా దేశంలోని ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆలోచనలో పడేసింది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం దేశంలో తిరుగుబాటు ఉధృతం కాకుండా మేల్కొంది. మరిపెడలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా నాయకులు పానుగోతు రాంలాల్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ అఫ్జల్, మాజీ ఎంపీటీసీ గందసిరి అంబరీష
బీజేపీ రాష్ట్ర నాయకులు ఇకనైనా కండ్లు తెరువాలి
అన్నదాతల ప్రాణాలతో ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడింది. అలుపెరుగని పోరాటం చేసి రైతులు కేంద్రం మెడలు వంచిన్రు.. ఇక నైనా బీజేపీ రాష్ట్ర నేతలు కండ్లు తెరువాలె.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలె’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హితవుపలికారు. హనుమకొండ రాంనగర్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆగం చేసేలా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శుభపరిణామమన్నారు. ‘రైతుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నరు. మొదటి నుంచీ రైతులకు సీఎం కేసీఆర్ అండగ ఉన్నరు. అలుపెరుగని పోరాటంతో అన్నదాతలు కేంద్రం మెడలు వంచిన్రు..
ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకులు కండ్లు తెరిచి మాట్లాడాలె.. పార్లమెంట్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు మన ఎంపీలను సపోర్ట్ చేయాలని ప్రధాని మోడీ కోరిండు. కానీ, మన పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించిన్రు. నాటి నుంచి మన రాష్ట్రంపై, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ప్రభుత్వం కక్షగట్టింది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉచిత కరెంట్ అందిస్తున్నడు. నీళ్లు అందిస్తున్నడు. పెట్టుబడి సాయం అందిస్తున్నడు. సాగునీటి కోసం ప్రాజెక్టులు కట్టించిండు. రైతు బీమా కూడా చేయించిండు. ఇన్ని మంచి పనులు చేయడం వల్లే ఇప్పుడు రైతుల కండ్లలో సంతోషం చూస్తున్నం. తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎడారిగా ఉండేది. తెలంగాణను సస్యశ్యామలం చేసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా మన రాష్ట్రంలో తేమ శాతం పెరిగిందని అనేక మంది నిపుణులు చెప్పిన్రు. ఇదంత కేసీఆర్ కృషి ఫలితమే.. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేసేదాకా పోరాటం ఆగదు.
ఊరుకునేది లేదు : చీఫ్‌విప్ దాస్యం
ప్రభుత్వ, ప్రజల ఆస్తులను, సంస్థలను కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం కుట్రపన్నిందని, ఒకవేళ అదేజరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదని లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని, ఒక రైతుగా సీఎం కేసీఆర్ ధర్నాలో కూర్చొని దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తి నాయకత్వం వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండాప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ధర్నాలతో మరింత సెగ
కొత్త వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు యాసంగి వడ్లు కొని రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ వివిధ రూపాల్లో నిరసన తెలిపింది. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో మహాధర్నాలు నిర్వహించింది. యాసంగి వడ్లు కొనేదాకా, సాగు చట్టాలు రద్దయ్యేదాకా టీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో వడ్లు కొనాలని, కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దుతుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి బాధ్యులు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు భారీగా తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు.
బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు..
మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడం రైతుల పోరాటానికి విజయం. ఎన్నో వ్యవయప్రయాసాలకోర్చి కుటుంబాలను సైతం వదిలిపెట్టి పోరాటం చేసిన రైతులకు అభినందనలు. ఈ ఉద్యమంలో వందలాది మంది రైతులు ప్రాణత్యాగం చేశారు. త్వరలో యూపీ, పంజాబ్‌లో జరిగే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయనే మోడీ సర్కారు ఈ చట్టాలను రద్దు చేసిందని భావించాలి. బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలి.
చట్టాల రద్దు హర్షణీయం
రైతులను ఇబ్బంది పెట్టేలా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించడం హర్షణీయం. ఏడాదిన్నర నుంచి నల్ల చట్టాలను రద్దుచేయాలని రైతులు చేసిన ఉద్యమ ఫలితంగానే కేంద్రం దిగొచ్చింది. ఈ పోరాటంలో ఎంతోమంది బలి అయ్యారు. ఇది వారి విజయమే. ఇప్పటికైనా రైతుకు మేలు చేసేలా చట్టాలు తీసుకురావాలి. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకకుండా రైతుల కోసం కేంద్రం ఆలోచించాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాలను రద్దు చేస్తామనడం ఊరటనిచ్చింది.
చరిత్రలో నిలిచిపోయే రోజు..
పోరాటం ఎప్పుడూ వృథాపోదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అహర్నిశలు చేసిన పోరాట ఫలితంగానే తిరిగి ఆ చట్టాలను బీజేపీ సర్కారు వెనక్కు తీసుకుంది. ఇది నరేంద్రమోదీ సర్కారుపై రైతులు సాధించిన విజయం. దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఇబ్బందిపెడితే భవిష్యత్తు ఉండదనే నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకున్నది. నవంబర్ 19వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది.
ఆందోళనలతోనే కేంద్రానికి కనువిప్పు
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : రైతులు ఏడాది కాలంగా చేస్తున్న ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. దేశవ్యాప్తంగా 750మంది బలి పెట్టి యూపీలో హత్యాకాండతో రైతుల ఉసురుతీసింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దిగొచ్చి నల్లచట్టాలను రద్దు చేసింది. అలాగే విద్యుత్ బిల్లు ప్రతిపాదనలు కూడా వెనక్కి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా రైతులు ఇంత పెద్ద పోరాటం చేయడం ఇదే తొలిసారి. దీనికి వామపక్ష పార్టీల ఆందోళనలు తోడై కేంద్రానికి కనువిప్పు కలిగింది. ఇది ముమ్మాటికీ రైతు విజయమే.
రైతులకు మేలు జరుగుతుంది..
వర్ధన్నపేట, నవంబర్ 19 : చట్టాలను రద్దు చేయాలని జాతీయస్థాయిలో రైతులు ఉద్యమాలు చేయడం వల్లే కేంద్రం దిగొచ్చింది. ఇది రైతులు సాధించిన విజయం. ఆలస్యంగానైనా నల్ల చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రైతులకు మేలు కలుగుతుంది. కొత్త చట్టాలను అమలు చేస్తే భవిష్యత్తులో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. -బానోతు రాజు, వర్ధన్నపేట
కేసీఆర్ ఉద్యమంతోనే చట్టాలు రద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు చట్టాల వల్ల కలిగే ఇబ్బందులు, కేంద్రం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం వల్లే కేంద్రం దిగొచ్చి వాటిని రద్దు చేసింది. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాల రూపంలో కుట్రలకు ప్రయత్నించినా జాతీయస్థాయిలో ఉద్యమాల వల్ల వెనక్కి తగ్గింది. కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయరంగం వెళ్తే రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. – అల్లమనేని మోహన్‌రావు, రైతు బంధు సమితి వర్ధన్నపేట మండల కన్వీనర్