వర్ధన్నపేట, మే 10: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, చేపట్టాల్సిన పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ మొదటి విడుతలో ఇల్లంద పాఠశాల ఎంపికైందన్నారు. కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాఠశాలలో చేపట్టాల్సిన పనులకు ఇటీవల శంకస్థాపన చేశారన్నారు. స్కూల్లో త్వరలోనే అన్ని పనులు చేపడుతామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, శిథిలావస్థలో ఉన్న గదులను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం పరికరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ పనులన్నీ ఎస్ఎంసీ, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలోనే జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో ఎంపికైన అన్ని పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను ఇంజినీరింగ్ అధికారులు తయారు చేసినట్లు వివరించారు. త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవో అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ మల్లెపాక కుమారస్వామి, వేణుగోపాల్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.