వరంగల్ చౌరస్తా, నవంబర్ 19: ‘రైతు పోరాటానికి ఫలితం దక్కింది. అన్నదాతలు నిర్విరామంగా పోరాటం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడలు వంచారు. ఇది రైతుల విజయం’ అని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) జిల్లా కమిటీ కన్వీనర్ పెద్దారపు రమేశ్, జిల్లా కో కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు అన్నారు. ఇటీవల అమలు చేసిన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం జంక్షన్లో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి కేంద్రం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను అమలు చేసిందన్నారు. దీంతో నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతోపాటు ఏడాదికాలంగా పోరాటాలు చేస్తున్న రైతులు ఎట్టకేలకు విజయం సాధించారన్నారు. నల్ల చట్టాల రద్దుతోపాటు పంటలకు మద్దతు ధర, స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రుణవిముక్తి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీరం రాములు, చుంచు రాజేందర్, ఓదెల రాజన్న, దామెరకొండ కొమురయ్య, కన్నం వెంకన్న, వంగల రాగసుధ, సుంచు జగదీశ్వర్, మాలి ప్రభాకర్, నరసయ్య, లక్ష్మి, మాదాసి సురేశ్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ అండర్‌బ్రిడ్జి వద్ద గల ఓంకార్ భవన్లో ఎంసీపీఐ(యూ) జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాధగోని రవి మాట్లాడుతూ కేంద్రం రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటన రైతుల గెలుపుగా అభివర్ణించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి పాల్గొన్నారు.
విజయోత్సవ సంబురాలు..
నర్సంపేట: అన్నదాతల పోరాటాల వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేశ్ అన్నారు. చట్టాల రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెల్లి రమేశ్, నాయకులు గడ్డం యాకయ్య, ఇల్లందుల సాంబయ్య, బాలనర్సయ్య, మియాపురం గోవర్ధన్, పాల కవిత, అయిత యాకోబు, నాగరాజు, శైలజా, మంజుల, అరుణ పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ
రైతు చట్టాల రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ నర్సంపేట పట్టణంలో సీపీఎం విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమంలో సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, నాయకులు భూక్యా సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, నామిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, ముంజాల సాయిలు, యార ప్రశాంత్, కే శ్రీనివాసరెడ్డి, పెండ్యాల సారయ్య, సంజీవ, ఉమా, నరేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు. చట్టాల రద్దుపై నల్లబెల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి కడియాల మనోహర్ మాట్లాడారు. ప్రజా పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రజా ఉద్యమాలు చేపట్టాయన్నారు. దీంతో కేంద్రం దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు వీరాచారి, రమేశ్, లింగయ్య, సమ్మయ్య, రవి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. రైతు చట్టాల రద్దుపై చెన్నారావుపేటలో సీపీఎం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.
పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పరికి మధుకర్ మాట్లాడుతూ రైతుల పోరాటానికి బీజేపీ ప్రభుత్వం మెడలు వంచిందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దుగ్గొండి మండలం గిర్నిబావిలో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ జిల్లా నాయకుడు ఈసంపల్లి బాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చెల్పూరి మొగిలి, వేములపల్లి ఓదెలు, బత్తిని స్వామి, కోడం రమేశ్, కొంగర నర్సింహస్వామి, మాదాసి శ్రీనివాస్, కుమారస్వామి పాల్గొన్నారు. సంగెం మండలం వంజరపల్లిలో సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య మాట్లాడుతూ రైతుల పోరాట ఫలితంగానే సాగు చట్టాలు రద్దయ్యాయని తెలిపారు.