కాశీబుగ్గ, మే 6: చిట్ ఫండ్ కంపెనీ యజమాని రూ. 30 కోట్లతో ఉడాయించడంతో అతడి వద్ద చిట్టీ వేసిన ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ లేబర్‌కాలనీ టీఆర్టీ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ నగరంలోని లేబర్‌కాలనీ టీఆర్టీకాలనీకి చెందిన మూడెడ్ల వెంకటేశ్వర్లు 20 ఏళ్ల నుంచి కల్పవల్లి చిట్స్ పేరుతో స్థానికంగా చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతడికి అదే కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ బాస్కుల శ్రీనివాస్(48) రూ. 25 లక్షల నగదును అప్పుగా ఇచ్చాడు. అలాగే, రూ. 20 లక్షల విలువైన చిట్టీలు వేశాడు. ప్రస్తుతం చిట్టీలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల మూడెడ్ల వెంకటేశ్వర్లు సుమారు రూ. 30 కోట్లతో పారిపోయాడు. దీంతో అవాక్కయిన బాస్కుల శ్రీనివాస్ మనస్తాపానికి గురయ్యాడు. ఆ డబ్బుతో సొంత ఇంటి నిర్మాణంతోపాటు ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో దాచుకున్న సొమ్ముతో చిట్టీ వ్యాపారి ఉడాయించడంతో ఆందోళనలో ఉన్న బాస్కుల శ్రీనివాస్ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట వేసి ఆందోళన చేశారు. దీంతో లేబర్‌కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్, సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబంతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎదిగిన ఇద్దరు కూతుళ్లు కండ్లెదుటే ఉన్నా చేతిలో చిల్లీగవ్వ లేకుండాపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, బాస్కుల శ్రీనివాస్ ములుగు జిల్లా పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు.
బాధిత కుటుంబానికి పరామర్శ
బాస్కుల శ్రీనివాస్ మృతదేహానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఏసీపీ కలకోట గిరికుమార్, సీఐ శ్రీనివాస్, కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, సీఆర్పీఎఫ్ కమాండర్ శాంతలాల్, ఎస్సై బాలకిషన్, హెడ్‌కానిస్టేబుల్ ఆంజనేయులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ బాస్కుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని, అండగా ఉంటామని తెలిపారు. చిట్స్ యజమానిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి చిట్టీ డబ్బులు వచ్చేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.