వరంగల్, మే 6 : వరంగల్ మహా నగరపాలక సంస్థ కొత్త పాలకవర్గం కొలువుదీరి శనివారానికి ఏడాది పూర్తయింది. పునర్విభజనతో గ్రేటర్ 66 డివిజన్లుగా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం 2021 మే 7న బాధ్యతలు చేపట్టింది. జీడబ్ల్యూఎంసీ ఏడాది పాల న నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే తీరుగా సాగింది. వినూత్నంగా నగరబాటకు శ్రీకా రం చుట్టి, సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికార యంత్రాంగంతో కలిసి వెళ్లింది. నగర ప్రజలపై పన్నుల భారం మోపకుండా సొంత ఆదాయం పెంపు దిశలో అడుగులు వేసింది. చారిత్రక నగరానికి స్మార్ట్ ఇమేజ్ తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. స్మార్ట్‌సిటీ పథకంలో ఇచ్చిన టాస్క్‌లను చాలెంజ్‌గా తీసుకుని లక్ష్యాన్ని సాధించింది. స్మార్ట్ ర్యాంకులో గ్రేటర్‌ను టాప్-10లో నిలిపింది. ఏడాది నగరపాలన అంతా అభివృద్ధి దిశలో సాగింది.
ఏడాదిలో ఎన్నో అభివృద్ధి పనులు..
పాలకవర్గం కొలువుదీరిన ఏడాదిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. గ్రేట ర్ సాధారణ నిధులు, పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం, స్మార్ట్ నిధులను నగర అభివృద్ధికి కేటాయించింది. డివిజన్లలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక దృష్టిసారించింది. అన్ని కాలనీల్లో ప్రగతి కనిపిస్తోంది. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, వైకుంఠధామాలు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మించేలా ప్రణాళికలు చేశారు. దీనికి తోడు నగరపాలనలో సాంకేతికతను జోడించేలా ఐసీసీసీ ఏర్పాటు కు అడుగులు వేశారు. రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం పాలకవర్గం సక్సెస్‌గా చెప్పుకోవచ్చు. నగరపాలనకు నాలుగు అంతస్తుల భవనంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకుంది. నగర పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిం ది. డంపింగ్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను నిర్వీర్యం చేసేందుకు బయో మైనింగ్‌పై దృ ష్టి సారించింది.
పారిశుధ్య వాహనాలు, వైకుంఠ రథాలు, ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయడం, 150 కేఎల్డీ సామర్థ్యం మానవవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు నిర్ణయాలు నగర పారిశుధ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నాయి. విలీన గ్రామాలతోపా టు నగరం అంతా అభివృద్ధి ఫలాలు అందించింది. ఏడాదిలో 5 సర్వసభ్య సమావేశాలు నిర్వహించిన పాలకవర్గం డివిజన్‌కు రూ.50 లక్షల అభివృద్ధి ని ధులు మంజూరు చేసింది. దీంతోపాటు పట్టణ ప్రగ తి, సాధారణ నిధులు వినియోగించింది. ప్రజల జీ వన ప్రమాణాలు మెరుగుపర్చేలా అడుగులు వేసిం ది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే రెండు మార్కెట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతోపాటు క్రెడిట్ రేటింగ్ ద్వారా రూ.90 కోట్ల రుణం తీసుకుని వరంగల్, హనుమకొండ బస్స్టేషన్లను స్మార్ట్‌గా మార్చనుంది.
నగరపాలనపై పట్టు..
కొత్త పాలక వర్గం నగరపాలనపై పట్టుసాధించింది. సత్వర నిర్ణయాలు నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. కొత్త మున్సిపల్ చట్టంలోని అంశాల అమలులో ప్రత్యేక దృష్టి సారిస్తున్నది, టీఎస్ బీపాస్ అమలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. స్మార్ట్‌సిటీలో ఇచ్చిన టాస్క్‌లను చాలెంజ్‌గా తీసుకుని సక్సెస్ సాధించింది. స్మార్ట్ ర్యాంకుల్లో టాప్-10లో నిలిపింది. 5 సర్వసభ్య సమావేశాల్లో ప్రజలపై కొత్త పన్నులు వేయకుండా సొంత ఆదాయం పెంచుకునేలా నిర్ణయాలు తీసుకుంది. అధికారుల సమన్వయంతో పాలనలో ఒడిదుడుకులు రాకుండా అడుగులు వేస్తున్నది.
ఏడాది పాలన సంతృప్తినిస్తోంది..
ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాభివృద్ధి కోసం శ్రమిస్తున్నా. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా నగర మంతా అభివృద్ధి జరిగేలా ముందుకు పోతున్నా. ప్రజలపై పన్నుల భారం వేయకుండా సొంత ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు చేశాం. చారిత్రక నగర ఇమేజ్ను మరింత పెంచేలా అభివృద్ధి చేస్తున్నాం. నగర సమర్థ పాలనతో పాటు ప్రజల భద్రత కోసం ఇంటిగ్రేటెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, దివ్యాంగులకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ , గ్రేటర్ పాలన భవన నిర్మాణాలను వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఏడాది పాలన చేశాం. రాబోయే నాలుగేళ్ల పాలన సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాగిస్తాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు అందించిన సహకారంతో ఏడాది పాలన సంతృప్తిగా సాగింది.
– గుండు సుధారాణి, మేయర్