వరంగల్, మే 3 (నమస్తేతెలంగాణ) : దేశమంతా విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా.. ఉద్యమ సమయంలో కేసీఆర్ ముందుచూపు.. స్వరాష్ట్రంలో పక్కా కార్యాచరణ కారణంగా తెలంగాణలో కరంటు కోతలకు తెరపడింది. సమైక్య పాలనలో కరంటు ఎప్పుడు వస్తుందో?, ఎప్పుడు పోతుందో? తెలియని పరిస్థితితులు ఉండేవి. ఎండకాలం వచ్చిందంటే కరంటు ఉండుడు గగనమే అయ్యేది. పగలు, రాత్రి కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. కరెంటు లేని సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పకపోయేది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అల్లాడిపోయేది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పందిర్ల కిందనో.. చెట్ల కిందనో సేదతీరాల్సి వచ్చేది. ఆర్థికంగా ఉన్నవాళ్లు ఇన్వర్టర్లు, జనరేటర్లు వాడేది.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో..
తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమే అని వెక్కిరించిన వారినే వెక్కిరించేలా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో కరంటు వ్యవస్థను బలోపేతం చేశారు. రాష్ర్టానికి కరంటు ఎంత అవసరం..? ఇక్కడ ఎంత ఉత్పత్తి అవుతున్నది? ఇంకా ఎంతా కొనాలి.. ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దాకా ఉన్న పరిస్థితి ఏమిటి తదితర అన్ని అంశాలపై పక్కా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. దీంతో విద్యుత్ కోతలే లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చేశారు.
కేసీఆర్ కరంటియ్యకుంటె గీ ఎండలకు సచ్చెటోళ్లం..
బచ్చన్నపేట : గింత ఘోరంగా ఎండలు ఎన్నడూ చూడలేదు. నిజంగా సీఎం కేసీఆర్ సార్ 24గంటల కరంటు ఇయ్యకపోతే గీ ఎండలకు సచ్చిపోయేటోళ్లం. ఎర్రటి ఎండల బాయికాడికి పోయి వచ్చేవరకు గాయిగాయి అయితాంది. ఇంట్లకు రాంగనే కూలర్ వేసుకొని పానం నిమ్మలమైతాంది. చిన్నా పెద్ద అందరూ ఎండ భయానికి ఇంటికాన్నే ఉంటాన్రు. ఇండ్లల్లోనే కూలర్లు పెట్టుకొని హాయిగా కునుకు తీత్తాన్రు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరంటు కోసం ఒక సావుసచ్చేది. ధర్నాలు, ఆందోళనలు, సబ్స్టేషన్లను ముట్టడించినం. ఇప్పుడు ఆ రంది లేదు. అటు ఎవుసానికి, ఇటు ఇండ్లల్లకు ఫుల్లు కరంటు ఇత్తాండు. ఇంత మంచి సర్కార్ మళ్లీ రావాలె. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
– భైరి బాలమల్లయ్య,పడమటికేశ్వాపూర్, బచ్చన్నపేట మండలంపొద్దుమాపు కూలర్ నడ్తాంది..
హనుమకొండ సబర్బన్ : పదేండ్ల కింద రాత్రిపూట సుత సక్కగ కరంటు ఉండకపోయేది. ఇట్లచ్చిందంటే అట్ల పోయేది. ఎండకాలం మొదలైందంటే మొత్తం చెట్ల కిందనే ఉండేది. ఇగ రాత్రి తిన్నంక మళ్లా ఇంటి ముందట్నే మంచాలేసుకొని పండుకునేది. ఇంట్ల గ్యాస్‌నూనె దీపాలు ఎప్పటికీ ఆజ్ఞలో ఉంచుకునేది. గిప్పుడు ఆ రోజులు పోయినయ్. సీఎం కేసీఆర్ అచ్చినంక ఫుల్ కరంటు ఉంటాంది. పొద్దుమాపు 24గంటలు కరంటు ఉంటాంది. ఫ్యాన్ ఏసుకొని పురుగుబూషి భయం లేకుంట కంటినిద్ర నిద్రవోతానం.
– కొమ్మిడి లక్ష్మారెడ్డి, ఎల్కతుర్తి
సల్లగాలి కోసం చెట్ల కిందికి పోయేది..
మహబూబాబాద్ రూరల్, మే 3 : కరంట్ కోసం అరిగోస పడ్డం. తెలంగాణ ప్రజలను ఈ కష్టాల నుంచి సీఎం కేసీఆర్ గట్టెక్కించిండు. లేకపోతే ఎండకాలంల ఉడ్కపోతకు ఆగమయ్యేది. సల్లగాలి కోసం చెట్ల కిందికి పోయేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫుల్ కరంటు ఉండుట్ల ఏసీ ఎప్పటికీ నడుత్తాంది. పిల్లలు కూడా ఇంట్లోనే ఆడుకుంటున్నరు. అప్పట్ల ఆంధ్రోళ్లు తెలంగాణ వస్తే కరెంట్ ఇబ్బంది వస్తదని అవహేళన చేసిన్రు. కానీ కేసీఆర్ చేయవట్టే పక్క రాష్టాల కంటే మన రాష్ట్రంలో కరంటు మంచిగుంటాంది. ఎండలు గీ కమాన కొడ్తున్నా.. ఇంట్ల మాత్రం సల్లగ ఉంటానం.
– బండారి పుష్పలీల, మానుకోట
ఇంట్లోనే హాయిగా ఉంటున్నా..
ఖానాపురం, మే 3 : ఉమ్మడి రాష్ట్రంలో ఎండకాలం వచ్చిందంటే కరంట్ లేక చాలా ఇబ్బంది పడేది. ఎప్పుడస్తదా అని వత్తులేసుకొని ఎదురుచూసేది. ఉడుకపోత భరించలేక చెట్ల కిందికి పోయేది. కానీ కేసీఆర్ వచ్చినంక తెలంగాణల కరంట్ కష్టాలు తీరినయ్. వారం పది రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నయ్. ఉక్కపోతలు కూడా మొదలైనయ్. కరంట్ కోతలు లేకపోవడం వల్ల మధ్యాహ్నం కూలర్ల కింద హాయిగా పడుకుంటున్నాం. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే 24గంటల కరంటు ఉంటాంది. అమెరికాలో కరెంటు కోతలు ఉండయట అని ఊళ్లో అనుకునేది.. కానీ నేడు ఆ అద్భుతం తెలంగాణ పల్లెల్లోనూ కనిపిస్తున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
– సోమారఫు రాజశేఖర్, బుధరావుపేట
ఇంట్లోనే ప్రశాంతంగా..
గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. 40 నుంచి 45 డిగ్రీల దాకా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. అయినా డిమాండ్‌కు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు సరఫరా చేస్తున్నది. 24గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నది. ఉక్కపోతలనే వెక్కిరించేలా విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో ప్రజలు ఇండ్లలోనే ఎంతో ఉపశమనం పొందుతున్నారు. నిరంతరం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పని చేస్తుండడంతో చల్లని వాతావరణంలో గడుపుతున్నారు. టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎండపూట హాయిగా కునుకుతీస్తున్నారు. ఇన్వర్టర్లను దాదాపుగా మూలనపడేశారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు కూడా ఇబ్బందులు లేకుండా పని చేసుకుంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద ప్రశాంతంగా చదువుకుంటున్నారు.
కరంట్ పోవుడన్న ముచ్చట్నే లేదు..
ఇదివరకు ఎండకాలం వచ్చిందంటే ఇంట్లో ఉండలేకపోయేవాళ్లం. కరంట్ ఎప్పుడచ్చేదో పోయేదో తెలువకపోయేది. ఇగ ఉడుకపోతకు చెమటలు కారి.. ఏ పని కూడా మనసున పట్టకపోయేది. ఇప్పుడా రంది లేకుంట జేశిండు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వచ్చినంక ఫుల్ కరంట్ ఇచ్చి అందరి కష్టాలు తీర్చిండు. గిప్పడు కరంటు పోవుడన్న ముచ్చట్నే లేదు. 24గంటలు ఉంటాంది. పిల్లలకు ఎండకాలం సెలవులు వస్తే ఇంట్లోనే టీవీ చూసుకుంట కూలర్ కింద ఆడుకుంటాన్రు. అటూఇటు జూశెవరకు పొద్దుగూకుతాంది.
– బండి విజయ, గృహిణి, జనగామ
పొరుగు రాష్ర్టాల్లో వెతలు
పొరుగు రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ర్టాల్లో ప్రజలు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు తిరుగక, ఏసీలు పనిచేయక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన బొగ్గు నిల్వలు లేక.. డిమాండ్‌కు సరిపడా కరెంటు సరఫరా లేక దేశంలోని అనేక రాష్ర్టాల్లో సంక్షోభం ఏర్పడినా తెలంగాణలో మాత్రం అలాంటి దుస్థితి లేదు. సీఎం కేసీఆర్ తీసుకున్న పకడ్బందీ చర్యలతో రాష్ట్రంలో కరెంటు కోతలు.. వెతలు లేకుండా పోయాయి.
పొరుగు రాష్ట్రంలోని గ్రామాల్లో దుస్థితి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో సమయ పాలన లేకుండా రోజూ 4గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నట్లు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పరిధిలోని అరుడ, అంకీస, అసరెల్లి, పోచంపల్లి తదితర గ్రామాల ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం లేక చెట్ల కిందే సేదతీరుతున్నారు. ఇక మారుమూల గ్రామాలకు రోజుల తరబడి విద్యుత్ సరఫరా ఉండడం లేదని అక్కడివారు చెబుతున్నారు. సిరొంచ తాలూకా పరిధిలోని అనేక గ్రామాలకు రోజుల తరబడి క రెంటు నిలిపి వేస్తున్నారని, కొన్ని గ్రామాల్లో సోలార్ విద్యుత్‌తో నెట్టుకొస్తున్నామని స్థానికులు తెలియజేశారు.
ఉడ్కపోత వశంగాక పోతుండె..
కమలాపూర్, మే 3 : నాది కమలాపూర్ మండలం ఉప్పల్. నాకు కిరాణం షాపు ఉంది. తెలంగాణ రాక ముందు కరంటు ఎప్పుడస్తదో రాదో తెలువకపోయేది. పొద్దటి నుంచి రాత్రిదాక దుకాణ్ల ఉండాలంటే ఎండకు ఆగమయ్యేది. ఉడ్కపోత వశంగాక పోతుండే. కరంటు సక్కగ లేక వ్యాపారం కూడా ఇబ్బంది అయితుండె. ఇప్పుడా రంది లేదు. రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయినంక కరంట్ కోతలు బంద్ అయినయ్. ఎప్పటికీ ఫుల్ కరంట్ ఉంటాంది. ఇప్పుడు కూలర్ పెట్టుకొని కిరాణం షాపులనే ఉంటాన. ఫ్యాన్, కూలర్ వేసుకుని అమ్ముతాన. వేడి అనేది తెలువకుంట అయింది. పక్క రాష్ర్టాలల్ల కరంటు కోతలు ఉన్నాయని టీవీల్లో చూస్తున్నం. కానీ తెలంగాణలో కోతల్లేకుండా కరంటు ఇచ్చుడు తెలంగాణ ప్రజల అదృష్టమే. ప్రభుత్వం కరంటు సరఫరా చేయడం వల్ల బిజినెస్ కూడా మంచిగైతాంది.
– ఆకినపల్లి వేణుగోపాల్, కిరాణాషాపు యజమాని ఉప్పల్