వరంగల్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు నంబర్లు కేటాయించనుంది. ఈ యాసంగి సీజన్ నుంచే నంబరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. కొత్త పద్ధతిలో రైతుకు కేటాయించిన నంబర్లను బస్తాలకు రాయనున్నారు. గన్నీ సంచులు ఇచ్చేప్పుడు ప్రభుత్వం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన సీరియల్ నంబర్ రాసి, విక్రయించిన తర్వాత రైతుకు కేటాయించిన బై నంబర్ వేస్తారు. దీంతో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. రైస్ మిల్లర్లు దిగుమతి సమయంలో కొర్రీలు పెట్టే అవకాశం ఉండదు. లారీ లోడులో డ్యామేజ్ ధాన్యం ఉంటే ఏ రైతువో సులువుగా గుర్తించే వీలుంటుంది. ఇతర రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. వెంటనే క్లియరెన్స్ ఇవ్వడం వల్ల డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో త్వరగాజమ అవుతాయి. –
వరంగల్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పస్తుత యాసంగి నుంచే అమలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నంబరింగ్ విధానాన్ని ఆచరణలో పెడుతున్నారు. సెంటర్లలో ధాన్యం విక్రయించే రైతులకు నంబర్లు కేటాయిస్తున్నారు. అదే నంబర్లను రైతుల ధాన్యం బస్తాలపై రాస్తున్నారు. రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వానాకాలం, యాసంగి ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో గత వానాకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లు కూపన్లు అందజేశారు. కూపన్లను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పరిశీలించి సదరు రైతులకు ధాన్యం నింపేందుకు అవసరమైన గన్నీ సంచులను ఇచ్చారు. ధాన్యాన్ని నింపి సెంటర్‌కు తీసుకెళ్లి అమ్మిన తర్వాత పౌరసరఫరాల సంస్థ రికార్డుల్లో ధాన్యం విక్రయించిన రైతు, బస్తాలు, క్వింటాళ్లు, ఏ రకం అనే వివరాలను నమోదు చేశారు. ఇవే వివరాలను సెంటర్ నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు రవాణా చేసే ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు జారీ చేసే ట్రక్షీటులోనూ పేర్కొన్నారు. దిగుమతి సమయంలో రైస్‌మిల్లర్లు ట్రక్షీటులో పేర్కొన్న రైతుల ధాన్యాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం ఉంటేనే ఇచ్చారు. ఆతర్వాతే ఆయా రైతులకు పౌరసరఫరాల సంస్థ ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం తేమ ఎక్కువగా ఉందని, నాసిరకమని రైస్‌మిల్లర్లు దిగుమతి సమయంలో కొర్రీలు పెట్టి క్లియరెన్సు ఇవ్వకుండా కాలయాపన చేశారు.
కొనుగోలు కేంద్రం నుంచి లారీలో పది మంది రైతుల ధాన్యం బస్తాలు రైస్‌మిల్లుకు వెళ్తే ఒకరిద్దరు రైతుల ధాన్యం నిబంధనల ప్రకారం లేకపోయినా, ఒకటి రెండు బస్తాల్లోని ధాన్యం డ్యామేజ్ ఉన్నా ఆ లారీలోని అన్ని బస్తాల ధాన్యానికి క్లియరెన్సు ఇచ్చేందుకు అంగీకరించలేదు. డ్యామేజ్ ధాన్యం ఏ రైతుదనేది తెలియక ఈ సమస్య తలెత్తేది. ఫలితంగా రైతులందరికీ ధాన్యం చెల్లింపు ఆలస్యమయ్యేది. చివరికి రైస్‌మిల్లర్లు బస్తాకు కొన్ని కిలోల ధాన్యం కోతపెట్టి క్లియరెన్స్ ఇస్తే క్వాలిటీ ధాన్యం అమ్మిన రైతులకు కూడా నష్టం జరిగింది. ఇది పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి రావటంతో అధికారులు సమస్య పరిష్కారం కోసం పలు ప్రతిపాదనలు చేశారు.
నంబర్లు వేసే విధానం
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు చేరిన ధాన్యం ఏ రైతుదో గుర్తించేందుకు ప్రభుత్వం నంబరింగ్ విధానాన్ని అమల్లోకి తేనుంది. దీన్ని ప్రస్తుత యాసంగి సీజన్ నుంచే ఆచరణలో పెట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కొత్త విధానం అమలుపై కొద్దిరోజుల క్రితం శిక్షణ ఇచ్చారు. ప్రతి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కచ్చితంగా నూతన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నంబరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దీన్నెలా ఆచరణలో పెడుతున్నారంటే.. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం సీరియల్ నంబర్లు కేటాయించింది. ఈ లెక్కన పీఏసీఎస్‌లు, ఐకేపీ, ఏఎంసీలు, ఎఫ్‌పీవోలు నిర్వహించే ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నంబర్ అలాట్ అయింది. ఉదాహరణకు 100వ నంబర్ కొనుగోలు కేంద్రానికి ఓ రైతు ఏఈవో జారీ చేసిన కూపన్‌తో వస్తాడు. ధాన్యం నింపి తెచ్చేందుకు తనకు వంద గన్నీ సంచులు కావాలని సెంటర్ నిర్వాహకులను కోరుతాడు. దీంతో వారు ఆ రైతుకు ఇచ్చే గన్నీ సంచులపై తమ సెంటర్ నంబర్ రాసి 100 సంచులు ఇస్తారు. సదరు రైతు వంద బస్తాల్లో ధాన్యం నింపి తూకం కోసం సెంటర్‌కు తెస్తాడు.
ఆ సంచిపై రాసిన సెంటర్ నంబర్ కింద ఇక్కడ ధాన్యం అమ్మిన రైతుల సీరియల్ నంబర్లను పరిగణలోకి తీసుకుని అతడికి కేటాయించిన నంబర్ రాస్తారు. సెంటర్లో రికార్డుల ప్రకారం ధాన్యం అమ్మిన వారిలో రైతు 9వ వ్యక్తి అయితే సెంటర్ నంబర్ 100 రాసి, దీని కింద బై 9 అని పేర్కొంటారు. ఇతడి ధాన్యం బస్తాలన్నింటిపైనా ఇలాగే 100/9 ఉంటుంది. ఇలా ఈ సెంటర్లో ధాన్యం అమ్మిన రైతుల బస్తాలపై సెంటర్ నంబర్ ఒకటే ఉంటుంది. కానీ బై నంబర్ మారుతుంది. సెంటర్ నిర్వాహకులు 100 నంబర్ కింద తమ సెంటర్లో ధాన్యం అమ్మిన రైతుల సీరియల్ నంబర్ ఒకటి నుంచి రాస్తారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు చేరిన ధాన్యంలో డ్యామేజ్ ఉంటే అది ఏ రైతుదో సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ధాన్యం బస్తాపై సెంటర్ నంబర్, ఆయా సెంటర్లో ధాన్యం విక్రయించిన రైతుల సీరియల్ నంబర్ ఉంటుంది. ఈ విధానం వల్ల పలు సమస్యలకు చెక్ పడనుంది.