నల్లబెల్లి, ఏప్రిల్ 30: బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘బాల్య వివాహాల నిర్మూలన’ అంశంపై సమీక్షించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణతోపాటు బాల్య వివాహాలు, పిల్లల అక్రమ దత్తత, బాల కార్మిక నిర్మూలన, అనాథ పిల్లల పరిరక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోనే బాలల స్నేహపూర్వక మండలంగా నల్లబెల్లిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి ప్రతి గ్రామ పంచాయతీలో బాలల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనంతరం మండలస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎంపీడీవో విజయ్‌కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఆర్ సురేశ్, పద్మలత, సుమన్, ఏసీడీపీవో హేమలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీ, ఏఎస్సై రాజేశ్వరి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, సర్పంచ్‌లు గోనె శ్రీదేవి, చీకటి ప్రకాశ్, ఎంపీటీసీ జన్ను జయరావు పాల్గొన్నారు.
బాల్యవివాహాలను రూపుమాపాలి
ఖానాపురం: బాల్యవివాహాలను రూపుమాపాలని చైల్డ్‌లైన్ ప్రతినిధి కొమ్ముల సతీశ్ పిలుపునిచ్చారు. చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు బాల్యవివాహాలు, చట్టాలు, పిల్లల సమస్యల పరిష్కారంపై శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల మహిళలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. మహిళలు, చిన్నారులకు ఏదైనా ఆపదలో వస్తే వెంటనే 1098 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బోయిని వెంకటస్వామి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.