వర్ధన్నపేట, ఏప్రిల్ 30: గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శనివారం ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాఖలవారీగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం నియోజకవర్గంలో రెండు పంటలకు సరిపడ సాగునీరు అందించడమే లక్ష్యంగా ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని విడుదల చేస్తుందని తెలిపారు. ఇంకా కొన్ని గ్రామాల్లో చెరువులకు ఉపకాలువలు సరిగాలేక నీరు అందడంలేదని గ్రామ ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, మరమ్మతులకు ఐబీ, ఎస్సారెస్పీ, దేవాదుల అధికారులు సమగ్రంగా సర్వేచేసి నివేదికను తయారు చేయాలన్నారు.
మండలంలోని ఇల్లంద, కోనారెడ్డి, దమ్మన్నపేట, దివిటిపల్లి గ్రామాల చెరువులకు నీరు అందించేందుకు కాలువలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి పెద్దచెరువు కట్ట శాశ్వత మరమ్మతు, వెడల్పు చేసేందుకు రూ.13కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇల్లంద రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఇల్లంద సర్పంచ్ సాంబయ్య సభలో ఎమ్మెల్యేకు తెలుపడంతో వెంటనే సర్వే చేసి సంరక్షించాలని తహశీల్దార్ నాగరాజును ఆదేశించారు. మండలంలోని పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో రూ.5.30కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. విద్యాశాఖ, ఇంజినీరింగ్, ఎస్‌ఎంసీల ద్వారా విద్యార్థుల అవసరాలను గుర్తించనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో రూ.9కోట్లతో సీసీరోడ్లు, కోటి రూపాయలతో మెటల్ రోడ్లను వేయించినట్లు పేర్కొన్నారు.
గ్రామాల వారీగా విద్యుత్ సమస్యలను చర్చించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గుడుంబా, బెల్టుషాపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇల్లంద, చెన్నారం, ఇతర గ్రామాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎక్సైజ్, పోలీసు అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా లేకుండా చూడాలని ఎవరైనా విక్రయిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మీ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఎంపీడీవో రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.
కేంద్రం రైతు ఆగ్రహానికి గురికాక తప్పదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేటలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, రైతులకు నష్టం కలిగించొద్దనే లక్ష్యంతో భారం పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం
ఇల్లందలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ క్రీడోత్సవాల్లో విజేత బండౌతాపురం జట్టుకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ బహుమతి, నగదు ప్రదానం చేశారు. 45 రోజులపాటు ఇల్లంద గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల్లో బండౌతాపురం జట్టు మొదటి స్థానం, ఇల్లంద జట్టు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఎమ్మెల్యే అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా విజేత జట్టుకు రూ.20వేలు అందించగా, సర్పంచ్ సుంకరి సాంబయ్య రెండో బహుమతిగా రూ.15వేలను ఇల్లంద జట్టుకు అందించారు. పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, ఇల్లంద, దమ్మన్నపేట సర్పంచ్‌లు సుంకరి సాంబయ్య, మంగ, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మీ, ఇల్లంద ఎంపీటీసీ శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.