దుగ్గొండి, ఏప్రిల్ 30: ‘పల్లె ప్రగతి’ పనుల్లో పంచాయతీ కార్యదర్శులు అంకితభావంతో పనిచేస్తేనే ఆదర్శ గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ బీ గోపి అన్నారు. శనివారం మండలంలోని గిర్నిబావిలో ఉన్న కనిష్కా ఫంక్షన్ హాల్లో పల్లెప్రగతి పనులపై నర్సంపేట డివిజన్ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. నిత్యం తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని చెప్పారు. సిబ్బందితో వీధులను ఊడిపించాలని, నీరు నిల్వకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో మొక్కలను సంరక్షించి హరితహారం కోసం ప్రజలకు పంపిణీ చేయాలన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను గ్రామ ప్రధాన రహదారికి ఇరువైపుల నాటి ఇంటర్నల్ రోడ్లలో పూలమొక్కలను నాటాలన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ఉంటూ వంద శాతం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. విధులు, బాధ్యతలను గుర్తెరిగి గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. విధుల్లో అలసత్వం వహిస్తూ సమయపాలన పాటించని వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు గ్రామాల్లో ప్రగతే కొలమానం అని చెప్పారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జిల్లా పంచాయతీ అధికారి నాగపూరి స్వరూప, డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, డీఎల్పీవో వెంకటేశ్వర్లు, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి, నర్సంపేట డీపీవోలు శ్రీధర్‌గౌడ్, కూచన ప్రకాశ్, సునీల్‌కుమార్‌రాజ్, గ్రామ అబివృద్ధి కమిటీ చైర్మన్ కూసం రాజమౌళి పాల్గొన్నారు.