వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నది. స్వయం ఉపాధి పొందేందుకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నది. ఒక్కో స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)కు రూ.2లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఇస్తున్నది. ఈ ఆర్థికసంవత్సరం జిల్లాలో 9,388 ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 426.81కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు సాధనకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రూ.72.54కోట్ల రుణాలను మహిళలకు అందజేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ ద్వారా ఎస్‌హెచ్‌జీలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నది. బ్యాంకుల నుంచి రుణాలను పొందుతున్న మహిళలు వ్యవసాయ అనుబంధ యంత్రాలు, పరికరాలతోపాటు ట్రాన్స్‌పోర్టు వాహనాలను సమ కూర్చుకుంటున్నారు. కుటీర పరిశ్రమలు, కిరాణా, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలను అందుకుంటున్న ప్రతి ఎస్‌హెచ్‌జీలో ఆరుగురు నుంచి పది మంది మహిళలు సభ్యులుగా ఉంటున్నారు. ఒక్కో ఎస్హెచ్జీకి కనిష్ఠంగా రూ.2లక్షలు రూ.20 లక్షల వరకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది. గత ఏడాది వర్ధన్నపేటలో ఉత్తమ ఫలితాలు సాధించిన 5ఎస్‌హెచ్‌జీలకు రూ.20లక్షల చొప్పున రుణాలను అందజేసింది. బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో ఎస్హెచ్జీకి రూ.20లక్షల రుణం ఇవ్వటం ఇదే తొలిసారి. ఈ రుణాలను పొందిన మహిళలు వాయిదా పద్ధతిన నెలనెల బ్యాంకులో వడ్డీ సహా చెల్లిస్తున్నారు. తీసుకున్న రుణం మొత్తం తిరిగి చెల్లించడం పూర్తయిన తర్వాత ప్రభుత్వం సదరు ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.
రాష్ట్రంలో మూడో స్థానం
2021-22 ఆర్థిక సంవత్సరం బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది జిల్లాలోని ఎస్‌హెచ్‌జీలకు రూ.328.32కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించారు. 6,906 ఎస్‌హెచ్‌జీలకు రూ.381.39కోట్లు పంపిణీ చేశారు. 116.17శాతంతో రాష్ట్రంలోనే తృతీయ స్థానం లో నిలిచారు. 124.92శాతంతో సంగారెడ్డి జిల్లా ప్రథమ, 124.15శాతంతో మెదక్ ద్వితీయ స్థానాలు దక్కించుకున్నాయి. గత ఏడాది జిల్లాలో మండలాల వారీగా సంగెంలో 584 ఎస్‌హెచ్‌జీలకు రూ.31.05 కోట్లు, నెక్కొండలో 685 ఎస్‌హెచ్‌జీలకు రూ.38.50, పర్వతగిరిలో 592 ఎస్‌హెచ్‌జీలకు రూ.28.37, వర్ధన్నపేటలో 492 ఎస్‌హెచ్‌జీలకు రూ.24.82, గీసుగొండలో 568 ఎస్‌హెచ్‌జీలకు రూ.28.17, రాయపర్తిలో 708 ఎస్‌హెచ్‌జీలకు రూ.31.94, చెన్నారావుపేటలో 580 ఎస్‌హెచ్‌జీలకు రూ.31,33, నర్సంపేటలో 665 ఎస్‌హెచ్‌జీలకు రూ.32.19, నల్లబెల్లిలో 685 ఎస్‌హెచ్‌జీలకు రూ.32.24, దుగ్గొండిలో 684 ఎస్‌హెచ్‌జీలకు రూ.25.04, ఖానాపురంలో ఎస్‌హెచ్‌జీలకు రూ.24.44 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు.
ఈ ఏడాది పెరిగిన టార్గెట్
ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా ఎస్‌హెచ్‌జీలకు పంపిణీ చేసే వడ్డీ లేని రుణాల లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గత ఏడాది 6,906 ఎస్‌హెచ్‌జీలకు రూ.381.39కోట్ల రుణ పంపిణీ జరగ్గా, ఈసారి 9,388 ఎస్‌హెచ్‌జీలకు రూ.426.81కోట్లు అందజేయాలని టార్గెట్‌గా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు మండలాల వారీగా ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసి లక్ష్యాన్ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నారు. బెస్ట్ ఎస్హెచ్జీలుగా గుర్తింపు పొందిన కొన్ని సంఘాలకు ఈసారి కూడా రూ.20లక్షల చొప్పున రుణాలను పంపిణీ చేసేందుకు ప్రణాళిక తయారుచేశారు. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గపరిధిలోని ఆరు మండలాల్లో 1,281 ఎస్‌హెచ్‌జీలకు రూ.72.54కోట్ల పంపిణీ జరిగింది. ఈనెల 20న నర్సంపేటలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముగింపు వేడుకల సభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి రూ.72.54కోట్ల రుణాలను చెక్కు రూపంలో అందజేశారు. ఈ రుణాలు ఏప్రిల్, మే నెల టార్గెట్‌కు సంబంధించినవని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ ఏడాది జిల్లాలో రూ.426.81కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, టార్గెట్ అధిగమిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సంపత్‌రావు చెప్పారు.