వరంగల్, ఏప్రిల్ 24: పది లక్షల జనాభా.. 407.71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహా నగరం పాలన ఇప్పుడు ఏకీకృతం కానుంది. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో ఒకే చోట నుంచి వీక్షించే వ్యవస్థ ఏర్పాటు కానుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల నగర పర్యటనకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.71 కోట్ల అంచనాతో కార్పొరేషన్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపికైన ప్రతి నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అందులో భాగంగానే దీనికి సంబంధించి డీపీఆర్‌ను వేగంగా తయారు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్మార్ట్‌సిటీ నగరాల సమావేశంలో ఐసీసీసీ ఏర్పాటుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మే 15 నాటికి టెండర్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించిన తరుణంలో గ్రేటర్ అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు.
నగర పాలన ఏకీకృతం
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగర పాలన ఏకీకృతం కానుంది. అన్ని విభాగాల పాలనను ఒకే చోట నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. పారిశుధ్య వ్యవస్థ, భవన నిర్మాణాలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు ఇలా ప్రతి అంశం లైవ్‌లో చూసే అవకాశం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కలుగుతుంది. అన్ని విభాగాల పాలనను ఏకీకృతం చేసే మానిటరింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ గవర్నెన్స్ అనుసంధానం చేయడం ద్వారా నగరంలో ఏ ప్రాంతంలో పన్నులు సక్రమంగా వసూలవుతున్నాయి, ఎక్కడ కావడం లేదు అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పారిశుధ్య వ్యవస్థను సులువుగా మానిటరింగ్ చేయొచ్చు. చెత్త రవాణా, ఇంటింటా చెత్త సేకరణ, డంపర్ బిన్ల లిఫ్టింగ్, పైపులైన్ లీకేజీలు తెలుసుకోవచ్చు. స్కాడాను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఫిల్టర్ బెడ్ల నుంచి తాగునీటి సరఫరా సరిగా జరుగుతుందా లేదా అనేది తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. వీధి దీపాల వ్యవస్థను ఏకీకృతం చేసి మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ వీధి దీపాలు వెలుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అంటున్నారు.
కాలుష్య ప్రాంతాలు గుర్తించవచ్చు
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో కాలుష్య ప్రాంతాలను గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో ఎన్విరాన్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా నగరంలో ఎక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవచ్చు దీంతో వెంటనే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా వాతావరణ శాఖతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రతి రోజు వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
నగర భద్రత పటిష్టం
ఐసీసీసీ ద్వారా నగర భద్రత మరింత పటిష్టం కానుంది. సర్వేలెన్స్ కెమెరాలతో నగరమంతా నిఘా పెట్టనున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలో 2 వేల సీసీ కెమెరాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తే నగరంలో సుమారు మరో 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అడుగడుగునా నిఘా పెట్టనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ సులువుగా మారుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో రెడ్ సిగ్నల్, అతి స్పీడ్ , రాంగ్ రూట్ నిబంధనలు అతిక్రమించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు అతిక్రమించే సెంటర్లను గుర్తించి అక్కడ ప్రత్యేక సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ద్వారా నగర భద్రత మరింత పటిష్టంగా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఐసీసీసీ డీపీఆర్ తయారీలో అధికారులు..
వచ్చే నెల 15 నాటికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు వారాల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఐసీసీసీ ఏర్పాటుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ డీపీఆర్ తయారు చేస్తున్నామని, ఇందుకోసం జీడబ్ల్యూఎంసీ భవనంలో ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్లు వివరించారు. టెండర్ ప్రక్రియలో ఐదేళ్లపాటు ఐసీసీసీ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు.