అమీర్‌పేట్(హైదరాబాద్), ఏప్రిల్ 24 : జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా కొనసాగుతు న్న మహిళా జర్నలిస్టుల సదస్సు ఆదివారం ముగియగా, సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై మాట్లాడారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో 18వేల మంది అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని చెప్పారు. రూ.100కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి కష్ట సమయాల్లో ముందుండి ఆదుకుంటోందని వివరించారు. కొవిడ్ సమయంలో 64 మంది జర్నలిస్టులు మృతిచెందగా, వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి భరోసానిచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక నిధి నుంచి ఇప్పటివరకు రూ.42కోట్లు వెచ్చించినట్లు వివరించారు. అనంతరం చాలెంజింగ్‌గా ఉండే జర్నలిజం వృత్తిని సమర్థంగా నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు. అలాగే సచివాలయ నూతన భవనంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు ఉండేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చా రు. వార్తాసంస్థల నిర్వహణలో పాశ్చాత్య దేశాల్లో అవలంబించే విధానాలను అందిపుచ్చుకోవడం వల్ల మహిళలకు జర్నలిస్టులుగా అవకాశాలు అందివచ్చాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్న వారిని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏ రంగంలో అయినా మహిళలు ఇబ్బందులు పడడం సాధారణమే అయినా.. ఎక్కడా కుంగిపోకుండా పురుషులకు దీటుగా రాణిస్తున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. పని ప్రదేశాల్లో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకం గా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం తన విధానాలను స్పష్టం చేసిందని కవిత గుర్తుచేశారు. ముగింపు సభలో ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్ సంగీతయాదవ్, మహిళా జర్నలిస్టులు మాలిని సుబ్రహ్మణ్యం, ధన్య రాజేంద్రన్, సుమబాల, శ్వేత, కవిత పాల్గొన్నారు.